వద్దే వద్దు! | - | Sakshi
Sakshi News home page

వద్దే వద్దు!

Apr 18 2026 8:23 AM | Updated on Apr 18 2026 8:23 AM

చిత్తూరు పక్క చూడని వైనం అస్తవ్యస్తంగా సర్కిల్‌ మార్పు

చిత్తూరా..

చిత్తూరు కార్పొరేషన్‌: ‘చిత్తూరా.. వద్దే వద్దు’ అంటూ ట్రాన్స్‌కో ఉద్యోగులు మొండికేస్తున్నారు. 25 మంది ఉద్యోగులు ఇక్కడ సర్దుబాటుకు ఆమోదం తెలిపినా అందులో 16 మంది ఇంతవరకు చిత్తూరు ముఖం చూడడానికే ఇష్టపడడం లేదు. పోస్టు చిత్తూరుకు మంజూరైనా పని మాత్రం తిరుపతిలోనే చేస్తూ జీతం తీసుకుంటున్నారు. దీంత ఎస్‌ఈ కార్యాలయంలో ఉన్న ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగింది.

జిల్లాల విభజన నేపథ్యంలో తిరిగి జిల్లా ట్రాన్స్‌కో స్వరూపం మారనుంది. గతంలో తిరు పతి కేంద్రంగా ఉమ్మడి జిల్లా పాలన జరిగేది. నవంబర్‌ 2024లో ట్రాన్స్‌కో జిల్లా పాలనను వేరుచేసి చిత్తూరులో ఎస్‌ఈ కార్యాలయం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇక్కడ నుంచి పాలన సాగిస్తున్నారు. డివిజన్లు, సబ్‌డివిజన్లు, సెక్షన్లలో మార్పు చేపట్టారు. అందులో భాగంగా ఇక ఉద్యోగుల బదిలీలు సాగనున్నాయి. మొదట ఎస్‌ఈ కార్యాలయం, తదుపరి ఈఈ కార్యాలయాల పరిధిలోని ఉద్యోగుల బదిలీలు చేపట్టనున్నారు. ఈ నెలఖారులోగా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు బదిలీల ఆప్షన్‌ కోరారు. ఇందులో సీనియార్టీ ప్రతిపాదికన బదిలీలు నిబంధనల ప్రకారం నిష్పత్తి విధానంలో చేయనున్నారు.

స్టోర్స్‌ కంట్రోల్‌ మారేనా?

ఉమ్మడి జిల్లాకు చిత్తూరులోని స్టోర్స్‌ నుంచే విద్యుత్‌ పరికరాలు వెళ్తున్నాయి. ఒక సబ్‌డివిజన్‌కు పరికరాలు కావాలంటే ఆరోజు కోసం తిరిగి వేచి చూడాల్సిన పరిస్థితి. అలా కాకుండా అత్యవసరమైతే అనుమతితో సబ్‌డివిజన్లకు పరికరాలు ఇచ్చే విధంగా సరళతరం చేయాలి. స్టోర్స్‌ కంట్రోల్‌ తిరుపతి జిల్లా టెక్నికల్‌ ఈఈ పరిధిలో ఉంది. పరికరాలు పంపిణీ చేయాలంటే ఈఈ వచ్చి పరిశీలించి ఆమోదం తెలిపితే తదుపరి అందజేస్తున్నారు. ప్రతిసారీ అధికారి రావాలంటే ఆలస్యమవుతోంది. స్టోర్స్‌ ఎదురుగానే చిత్తూరు ఎస్‌ఈ కార్యాలయం ఉంది. ఇక్కడ ఉన్న టెక్నికల్‌ ఈఈకి పరిశీలన పవర్స్‌ ఇస్తే పంపిణీ వేగవంతమవుతుందని ఉద్యోగులు చెబుతున్నారు.

ట్రాన్స్‌కో ఉద్యోగుల బదిలీలకు ఆప్షన్‌

గందరగోళం

ప్రస్తుతం ట్రాన్స్‌కో జిల్లా స్వరూపం మారునుంది. అస్తవ్యస్తంగా జిల్లాను మార్పు చేశారు. గతంలో 40 సెక్షన్లు, 10 సబ్‌ డివిజన్లు, 3 డివిజన్లు ఉండేవి. ఇప్పుడు 34 సెక్షన్లు, 8 సబ్‌డివిజన్లు, 2 డివిజన్లుగా విభజించారు. చిత్తూరు అర్బన్‌ డివిజన్‌ పరిధిలో చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాలు వస్తాయి. ఇప్పుడు అధనంగా కల్లూరు, రొంపిచెర్లను చేర్చారు. అదేవిధంగా చిత్తూరు రూరల్‌ పరిధిలో జీడీనెల్లూరు నియోజకవర్గం, నగరి ఉండేవి. ప్రస్తుతం పలమనేరు, కుప్పం నియోజకవర్గాలు చేరనున్నాయి. పుంగనూరు అన్నమయ్య జిల్లాకు వెళనుంది. ప్రస్తుతం చిత్తూరు అర్బన్‌, చిత్తూరు రూరల్‌, పుంగనూరు డివిజన్లు జిల్లా పరిధిలో ఉన్నాయి. కొత్తగా చేసిన మార్పు వల్ల వినియోగదారులు అవస్థలు పడనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement