– ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’తో పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు
చిత్తూరు అర్బన్: జిల్లాలో విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల పరిధిలో సిగరెట్లు, గుట్కా, ఖైనీ వంటి ఉత్పత్తులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు. ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ డ్రైవ్‌లో భాగంగా స్థానిక పోలీసులు, ఈగల్, ఎస్బీ సిబ్బంది సంయుక్తంగా చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 612 కేసులు నమోదు చేసి రూ.69,500 జరిమానా విధించినట్లు ఎస్పీ వెల్లడించారు. గత ఏడాది 1901 కేసులు నమోదు చేసి రూ.2.77 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. పొగాకు ఉత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని, ముఖ్యంగా విద్యార్థులు అలవాటు పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కోట్పా చట్టం–2003 ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పొగాకు విక్రయాలను నిలిపివేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
– పలమనేరు ఇరిగేషన్‌శాఖలో
రూ.13 వేలు తీసుకుంటూ పట్టుబడిన వైనం
పలమనేరు: పట్టణంలోని ఇరిగేషన్‌శాఖ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కొన్ని పనులకు సంబంధించి మామూళ్లు తీసుకుంటున్న సీనియర్ అసిస్టెంట్ అబ్దుల్ రజాక్‌ను తిరుపతి ఏసీబీ అధికారులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఇదే కార్యాలయంలో సిబ్బంది మొదలు డీఈ దాకా ఇరిగేషన్ సంబంధిత పనులను అక్రమంగా నిర్వహిస్తూ దోపిడీ చేస్తున్నారనే విషయం తెలిసిందే. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు బాధితుడు డబ్బులిస్తుండగా ఏసీబీ అధికారులు పక్కాగా సీనియర్ అసిస్టెంట్‌ను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
నాణ్యత పాటించాలి
చిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని కణ్ణన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్మిస్తున్న బాలికల వసతి గృహ పనుల్లో నాణ్యత పాటించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ ఆదేశించారు. శుక్రవారం ఆయన వసతి గృహ నిర్మాణ పనులను ఆకస్మికంగా పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో పురోగతి చూపాలన్నారు. నాణ్యతలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్ణీత గడువు లోపు పనులను పూర్తి చేయాలన్నారు. గదుల్లో వెలుతురు, గాలి ధారాళంగా వచ్చేలా ఉండడంతో పాటు ఇతర మౌలిక వసతులు సమృద్ధిగా ఉండాలని అధికారులను ఆదేశించారు.


