చిత్తూరు కలెక్టరేట్ : స్వీయ జనగణన ప్రక్రియలో పది నిమిషాల సమయం కేటాయిస్తే పదేళ్ల అభివృద్ధికి సహకరించినట్లేనని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో విలేకరుల సమావే శం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు దిక్సూచిగా నిలిచే జనగణన ప్రక్రియ పకడ్బందీగా చేపట్టినట్టు వెల్లడించారు. పాత పద్ధతులకు భిన్నంగా సాంకేతికతను జోడించి పౌరులే స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునే ప్రక్రియ ప్రారంభించారన్నారు. స్వీయ జగనణన కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా చేపట్టేలా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాను మొత్తం 3,036 బ్లాకులుగా విభిజించామన్నారు. ప్రతి బ్లాక్‌లో 150 నుంచి 200 గృహాలు ఉండేలా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియకు 28,885 మంది ఎన్యుమరేటర్‌లు, 493 మంది సూపర్‌వైజర్‌లు విధుల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. జిల్లాలోని 27 మండలాలు, 3 మున్సిపాలిటీలు, 1 నగరపాలక సంస్థ పరిధిలో 31 మంది అధికారులు నిరంతరం ప్రక్రియను పర్యవేక్షిస్తారన్నారు. ఈ నెల 30లోపు ఆన్‌లైన్ పోర్టల్‌లో ప్రజలు స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. మే 1 నుంచి 30 వ తేదీ వరకు ఎన్యుమరేటర్‌లు ఇంటింటికి వచ్చి స్వీయ జనగణను ధృవీకరించడంతో పాటు, నమోదు చేసుకోని వారి వివరాలు సేకరిస్తారన్నారు. వచ్చే ఏదాది రెండవ దశ జనాభా లెక్కల సేకరణ పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతుందన్నారు. సమావేశంలో డీఆర్‌వో మోహన్‌కుమార్ పాల్గొన్నారు.


