మొదటి ఏడాది 69 శాతం, రెండో ఏడాది 71 శాతం ఉత్తీర్ణత
నిరాశాజనకంగా ఇంటర్ ఫలితాలు
సీఎం చంద్రబాబు జిల్లాలో విద్యాశాఖ వైఫల్యం
గత ఏడాది కంటే తగ్గిన ఉత్తీర్ణత శాతం
బాలికలదే పైచేయి
బాలుర పరిస్థితి దయనీయం
కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ నాశనం అవుతోంది. పాలకులు, అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు, సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఉత్తీర్ణత శాతం తగ్గిపోతోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మరీ అధ్వానంగా పరిస్థితి తయారైంది. బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో రాష్ట్రంలో 22, 24 స్థానాలకు పడిపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రతి ఏటా ఉత్తీర్ణత శాతం తగ్గిపోతుండడంతో విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ కళాశాలల్లో సరైన వసతులు కల్పించకపోవడం, అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయకపోవడంతోనే ఉత్తీర్ణత శాతం పడిపోతోందని వాపోతున్నారు.
ప్రస్తుత విద్యాసంవత్సరం ఫలితాలు
విద్యా మొదటి ఏడాది మొదటి ఏడాది రెండో ఏడాది రెండో ఏడాది
సంవత్సరం స్థానం శాతం స్థానం శాతం
2023–24 25 50 26 63
2024–25 26 54 24 74
2025–26 22 69 24 71
సంవత్సరం హాజరైన ఉత్తీర్ణులైన
విద్యార్థులు వారు
మొదటి 12,567 8,691
రెండవ 11,651 8,280
చిత్తూరు కలెక్టరేట్ : సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఇంటర్మీడియట్ ఫలితాలు ఘోరంగా పడిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా అట్టడుగు స్థానానికి పరిమితమైంది. చిత్తూరు జిల్లా అక్షర క్రమంలో మొదటి స్థానంలో ఉండగా, ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 22, ద్వితీయ సంవత్సరంలో 24వ స్థానానికి పడిపోయి లాస్ట్‌బెంచ్ ముద్ర వేయించుకుంది.
పాతాళానికి ఫలితాల గ్రాఫ్
గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఫలితాలు మెరుగుపడతాయని ఆశించిన వారికి తీవ్ర నిరాశే ఎదురైంది. విద్యాశాఖ పర్యవేక్షణ లోపమో లేక ప్రణాళికా రాహిత్యమో గాని ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోయింది. గత ఏడాది మొదటి సంవత్సరంలో 54 శాతం ఉత్తీర్ణతతో 26వ స్థానంలో ఉండగా, ఈ సారి 69 శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరంలో గత ఏడాది 74 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది ఆ ఉత్సాహం నీరుగారింది. ప్రస్తుతం రెండో సంవత్సరంలో 71 శాతం ఉత్తీర్ణత సాధించి 24వ స్థానంతో సరిపెట్టుకున్నారు.
మెరిసిన బాలికలు
ఇంటర్ ఫలితాల్లో బాలికలు బాలుర కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. ప్రతి ఏటా ఇంటర్‌లో ప్రవేశాలు పొందడంతో పాటు ఉత్తీర్ణులు కావడంలోనూ, అత్యధిక మార్కులు సాధించడంలోనూ వారు ముందంజలో నిలుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల నుంచి మొదటి సంవత్సరం ఇంటర్‌లో బాలురు 5,861 మంది హాజరుకాగా 3671 మంది ఉత్తీర్ణులయ్యారు. 62.63 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 6,706 మందికి గాను 5,020 మంది ఉత్తీర్ణులై 85.65 శాతం సాధించారు. రెండో సంవత్సరంలో బాలురు 5,546 మందికి గాను 3521 మంది ఉత్తీర్ణులై 63.48 శాతం సాధించగా, బాలికలు 6,105 మందికి గాను 4,759 మంది ఉత్తీర్ణులై 77.95 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు వెల్లడించారు.
ఇప్పటికై నా కళ్లు తెరుస్తారా?
ఫలితాల విడుదల అనంతరం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లోతీవ్ర నిరాశ నెలకొంది. గత ఏడాదికంటే ఫలితాలు మెరుగుపడతాయని ఆశించినప్పటికీ ఫలితాలు మరింత దిగజారాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల తర్వాత కంటితుడుపు చర్యగా సమీక్షలు చేయడం కాకుండా, క్షేత్రస్థాయిలో లోపాలను సరిదిద్దాలని సూచిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరిచి జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయకపోతే అక్షర క్రమంలో మాత్రమే కాదు, అధమ ఫలితాల్లోనూ జిల్లా నంబర్ వన్‌గా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
వైఫల్యానికి కారణాలు ఇవేనా?
పర్యవేక్షణ శూన్యం : జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో కళాశాలలను సందర్శించి, బోధనా నాణ్యతను తనిఖీ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.
అధ్యాపకుల కొరత : జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కీలకమైన సబ్జెక్టులకు అధ్యాపకులు లేరు. దీంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రైవేట్ మాఫియా : కార్పొరేట్ కళాశాలలు ర్యాంకుల వేటలో పడి సగటు విద్యార్థిని నిర్లక్ష్యం చేయడం, వారిపై మానసిక ఒత్తిడి పెంచడం వల్ల ఫలితాలు తారుమారయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సమీక్షల ప్రహసనం : విద్యాసంవత్సరం ప్రారంభంలో అధికారులు నిర్వహించే సమీక్షలు ఫోటోలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించిన దాఖలాలు లేవు.
విద్యార్థులు ఆందోళన చెందొద్దు
పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఆందోళన చెందొద్దు. మరింత మెరుగ్గా చదివి అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలి. తల్లిదండ్రులు సైతం సంయమనంతో వ్యవహరించాలి. ఫెయిల్ అయితే ఇంతటితో అంతా ముగిసిపోయినట్టు కాదని పిల్లలకు ధైర్ఘ్యం చెప్పాలి. ఆందోళన, భయం చెందాల్సిన అవసరం లేదు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
– రఘుపతి, ఇంటర్మీడియట్ డీఐఈవో
సీఎం జిల్లాలో ఈ దుస్థితి ఎందుకో..?
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఫలితాలు ఇంత నిరాశాజనకంగా ఉండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక వైపు కుప్పం నుంచి చిత్తూరు వరకు విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని గొప్పలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఫలితాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లా అధికారుల సమీక్షలు, పర్యవేక్షణ కాగితాలకే పరిమితమయ్యాయా అనే ప్రశ్నలు తలెత్తతున్నాయి.


