సాయంత్రానికి వడ్డీతో కలిపి అసలు వసూలు ఫైనాన్సియర్ల గుప్పిట్లో టమాటా వ్యాపారం రోజుకు రూ.2 కోట్ల లావాదేవీలు అలాగే అరకోటి మీటర్ ఫైనాన్స్ వ్యాపారుల కోసం మండీదారుల పాట్లు
వడ్డీ వ్యాపారం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. కొంతమంది నగదును నెలవారీ వడ్డీకి ఇస్తుండగా, మరికొందరు సంవత్సరం వడ్డీకి ఇస్తున్నారు. ఇంకొందరు రోజువారి వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. ముఖ్యంగా దినసరి మార్కెట్లు, టమాటా మార్కెట్లు, మండీల్లో రోజువారి వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతోంది. వ్యాపారులు ఉదయాన్ని నగదు ఇచ్చి సాయంత్రం వడ్డీతో కలిపి అసలు వసూలు చేసుకుంటారు. పలమనేరు టమాటా మార్కెట్‌లో స్థానికులతోపాటు చైన్నెకి చెందిన వారు వడ్డీ వ్యాపారాన్ని సాగిస్తున్నారు.
పలమనేరు : పలమనేరు టమాటా మార్కెట్‌లో 50 వరకు మండీలు ఉన్నాయి. ఇక్కడికి ప్రతి రోజూ 70 లోడ్ల వరకు టమాటాలు వస్తుంటాయి. పలమనేరు నియోజకవర్గంలోనూ టమాటా సాగు ఎక్కువగానే ఉంది. అలాగే అనంతపురం జిల్లా నుంచి అప్పుడప్పుడూ సరుకు భారీగా వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ప్రతిరోజూ రూ.కోట్లలో వ్యాపారం జరుగుతుంది. ఈ క్రమంలో మండీ వ్యాపారులు సొంతంగా పెట్టుబడి పెట్టుకోలేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రోజుకు రూ.2 కోట్ల వరకు రోజువారీ ఫైనాన్స్‌గా తీసుకుంటున్నారు. ఇక మీటర్ ఫైనాన్స్‌గా మరో రూ.2 లక్షలు పొందుతున్నారు. మీటర్ ఫైనాన్స్ అంటే ఉదయం 11 గంటలకు రూ.10 లక్షలు ఇస్తే సాయంత్రానికి రూ.10 వేలు కలిపి కట్టాలి. నిత్యం 30 మంది ఫైనాన్స్‌దారులు ఇక్కడ రూ.కోట్ల అప్పులు ఇస్తున్నారు. కొందరు చైన్నె నుంచి ఇక్కడికి వచ్చి డైలీ ఫైనాన్స్ ఇస్తున్నారు. ఇలా అధిక వడ్డీలతో ఫైనాన్స్ పొంది వ్యాపారులకు సరుకును అప్పుగా వేసి రైతులకు బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.
కటింగ్ క్రేట్లతోనే అసలు సమస్య
పొరుగు మార్కెట్లలో పుల్ క్రేట్లతో టమాటాలను విక్రయిస్తున్నారు. అంటే బాక్సుకు 18 కేజీలు కాయలు ఉంటాయి. ఇక్కడ మాత్రం బాక్సుకు 14 కేజీలు ఉంటాయి. చైన్నె మార్కెట్‌లో అమ్మేది కటింగ్ క్రేట్లే. బయటి వ్యాపారులు వంద పుల్ క్రేట్లను కొంటే వారికి కటింగ్ క్రేట్లు 120గా చేస్తారు. అదే పలమనేరులో వంద కటింగ్ క్రేట్లను కొంటే 95 క్రేట్లే వస్తాయి. దీంతో ఇక్కడికి వ్యాపారులు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. పుల్ క్రేట్ల ధర భాక్సుకు రూ.20 ఎక్కువగా ఉన్నా సరుకు సర్దుబాటు అవుతుందని వ్యాపారులు అక్కడికే వెళుతున్నారు. ఇక్కడ కూడా పుల్‌క్రేట్లు పెడదామంటే కటింగ్ క్రేట్లను వేలల్లో కొనుగోలు చేశామని, వాటిని ఏమి చేసుకోవాలో అర్థం కావడం లేదని మండీ యజమానులు చెబుతున్నారు. వ్యాపారుల తప్పిదానికి రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
ధరలపైనా ప్రభావం
వ్యాపారులు క్రేట్ల సమస్యతో ఇక్కడికి రావడం లేదు. అంతేగాక అన్ని మార్కెట్ల వేలం పాట నిర్వహించిన తర్వాతే పలమనేరులో వేలం పాటలు నిర్వహించి ధర నిర్ణయిస్తున్నారు. దీనివల్ల స్థానికంగా టమాటా ధరలు తరచూ తక్కువగా పలుకుతున్నాయి. చాలా మంది రైతులు మండీ యజమానుల వద్ద ముందుగానే అప్పు తీసుకోవడం వల్ల ధరల గురించి ప్రశ్నించలేకపోతున్నారు. వారు నిర్ణయించిన ధర ప్రకారం తీసుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం పక్కనే ఉన్న వడ్డిపల్లెలో బాక్సు రూ.330గా ఉంటే ఇక్కడ మాత్రం రూ.230గానే ఉంది.
నష్టపోకుండా జాగ్రత్త పడుతున్న
మండీల వారు
కర్ణాటకలోని కోలారు, వడ్డిపల్లి, మదనపల్లెలో టమాటాలకు వేలం పాట ఉదయం 8 గంటలకు జరుగుతుంది. ఆపై వడ్డిపల్లెలో 10 గంటలకు, పుంగనూరులో 11 గంటలకు పాటలు నిర్వహిస్తారు. వీటి ధరలను అనుసరించి ఇక్కడి వ్యాపారులు వేలం పాట మొదలు పెడతారు. తద్వారా తమకు నష్టం రాకుండా మండీ యజమానులకు జాగ్రత్త పడుతున్నారు.
వ్యాపారులకు మండీ యజమానుల షేర్
ఇక్కడ టమాటాలను కొనుగోలు చేసేందుకు బయటి వ్యాపారులను మండీ యజమానులు బతిమలాడి పిలిపించుకోవాల్సి వస్తోంది. దీనికి తోడు తమకొచ్చే కమీషన్‌లో కొంత వాటా కూడా ఇస్తున్నారు. వారికి సరుకు అప్పుగా ఇవ్వకపోతే కొనేవారే ఉండరు. రైతుల నుంచి మండీ వ్యాపారులు పది శాతం కమీషన్ తీసుకుంటే అందులో కొంత వ్యాపారులకు ఇవ్వాల్సి వస్తోంది. ఇక క్రేట్ల మిస్సింగ్‌కు 1 శాతం, కూలీల ఖర్చులు, ఫైనాన్స్‌కు వడ్డీ ఇలా 2 శాతం, నగదు లావాదేవీల్లో నష్టాలకు ఒక శాతం కలిపి మొత్తం 8 శాతం ఆదాయం ఖర్చు అవుతోందని మండీ యజమానులు చెబుతున్నారు.


