చిత్తూరు కలె క్టరేట్ : అంబేడ్కర్ ఆశయసాధనే యువతకు మార్గదర్శకమని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవనంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 136వ జయంతిని ఘనంగా నిర్వహించారు. దర్గా సర్కిల్ నుంచి అంబేడ్కర్ భవనం వద్దకు ర్యాలీ నిర్వహించారు. అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ అంబేడ్కర్ చిన్నతనంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ విద్యతో ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగారని కొనియాడారు. ప్రతి విద్యార్థి అంబేడ్కర్ రచించిన పుస్తకాలను చదివి ప్రేరణ పొందాలని సూచించారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన రాజ్యాంగాన్ని రూపొందించిన ఘనత అంబేడ్కర్‌కే దక్కుతుందన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ సమానత్వం, స్వేచ్ఛ కోసం పోరాడిన అంబేడ్కర్ ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలన్నారు. అనంతరం డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి గాను 47 స్వయం సహాయక సంఘాలకు రూ.47 లక్షల వడ్డీలేని రుణాల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సంజయ్‌గాంధీనగర్‌లోని ఏపీఎస్‌డబ్ల్యూఆర్ పాఠశాల విద్యార్థినులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ అలరించాయి. డీఆర్‌వో మోహన్‌కుమార్, ఆర్‌డీవో శ్రీనివాసులు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రబ్బానిబాషా, డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, మాల కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్, చుడా చైర్మన్ కఠారి హేమలత, డీవీఎంసీ సభ్యులు రాజ్‌కుమార్, ధనశేఖర్, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
అంబేడ్కర్‌కు ఎస్పీ ఘన నివాళి
చిత్తూరు అర్బన్: రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్.అంబేడ్కర్ చిత్రపటం వద్ద చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ ఘన నివాళులర్పించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి నేపథ్యంలో.. చిత్రపటానికి నివాళులర్పించారు. భారతదేశ స్థితి–గతిని మార్చిన దార్శినికుడు అండ్కేర్ అని గుర్తుచేశారు. ఎస్పీ వెంట ఏఆర్ ఏఎస్పీ దేవదాసు, డీఎస్పీ మహబూబ్ బాషా, ఇన్‌స్పెక్టర్ మురళీమోహన్, ఆర్‌ఐలు సుధాకర్, చంద్రశేఖర్ ఉన్నారు.
అంబేడ్కర్ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న ఎస్పీ తుషార్ డూడీ
అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న
కలె క్టర్ సుమిత్ కుమార్ గాంధీ


