చిత్తూరు కలెక్టరేట్ : అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తతే రక్షణ కవచం అని ప్రిన్సిపల్ జిల్లా జడ్జి అరుణసారిక అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అగ్నిప్రమాదాల పట్ల చేపట్టాల్సిన జాగ్రత్తలపై ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. అగ్నిమాపక శాఖలో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన అమరవీరుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు నివారించడానికి ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమన్నారు. గృహాలలో గ్యాస్ సిలిండర్లు, విద్యుత్ పరికరాలను సురక్షితంగా వినియోగించాలని సూచించారు. నిర్లక్ష్యం వల్ల చిన్న ఘటనలు పెద్ద ప్రమాదాలుగా మారే అవకాశముంటుందన్నారు. ప్రజాచైతన్యంతోనే అగ్నిప్రమాదాల నివారణ సాధ్యమవుతుందన్నారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి మాట్లాడుతూ అజాగ్రత్తతోనే అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. అసిస్టెంట్ జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి కరుణాకర్ మా ట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 20 వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన ఫైర్ ఫైటింగ్ అండ్ రెస్క్యూ పరికరాల స్టాల్‌ను జిల్లా జడ్జి పరిశీలించారు. వారోత్సవాల కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఏసుపాదం, నరేష్, విజయ్, రాజు, జయ, సతీష్, గిరిబాబు పాల్గొన్నారు.


