ఘనంగా తమిళ సంవత్సరాది వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా తమిళ సంవత్సరాది వేడుకలు

Apr 15 2026 7:44 AM | Updated on Apr 15 2026 7:44 AM

నిండ్ర (నగరి): మండలకేంద్రమైన నిండ్ర ఓంశక్తి ఆలయంలో మంగళవారం తమిళ ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

నేడు ప్రదోషకాల పూజలు

వెదురుకుప్పం: డీఆర్‌ఎన్‌కండ్రిగ సమీపంలో ఉన్న అరుణగిరిపై కొలువైన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత కొండమల్లీశ్వర స్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం ప్రదోష కాల పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు రమేష్‌ మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఏకకాలంలో నందీశ్వరునికి, శివునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ ఏటీజీహెచ్‌ వద్దకు చేరుకుంది. సోమ వారం అర్ధరాత్రి వరకు 72,724 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,786 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.17 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

నేటి నుంచి సముద్రంలో వేటకు విరామం

తిరుపతి అర్బన్‌ : సముద్రంలో చేపల వేటకు బుధవారం నుంచి విరామం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గంగపుత్రులు రెండు నెలలుపాటు తమ వలలకు విశ్రాంతి ఇవ్వనున్నారు. చేపల సంతానోత్పత్తి నేపథ్యంలో ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు చేపల వేటపై ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది. ఈ క్రమంలో చేపల వేట సాగించే మత్స్యకారులు ఇంటికే పరిమితం కానున్నారు. ఈ సమయంలో దెబ్బతిన్న వలలు, బోట్లకు మరమ్మతులు చేసుకునే పనుల్లో నిమగ్నం కానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement