పాత నాణేలు, మ్యాజిక్ కాయిన్స్ పేరుతో ఘరానా మోసం
ఇత్తడి చెంబులో మహిమలున్నాయంటూ
రూ.5 లక్షలకు బేరం
రూ.లక్ష చెల్లించి మోసపోయిన బాధితుడు
గుట్టువిప్పిన పెద్దపంజాణి పోలీసులు
నలుగురి అరెస్ట్, ఇద్దరు పరార్
గంగవరం: రైస్ పుల్లింగ్ ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. పాతా నాణేలు, ఇత్తడి చెంబు, మ్యాజిక్ కాయిన్స్ తదితర వాటితో రైస్ పుల్లింగ్ చేస్తూ ప్రజలను మోసగించే ఘరానా ముఠాను గంగవరం సర్కిల్ స్టేషన్‌లో పలమనేరు రూరల్ సీఐ పరశురాముడు ఆధ్వర్యంలో మంగళవారం అరెస్ట్ చూపించారు. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఇద్దురు పరారీలో ఉండగా నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. వికోట మండలం, కుంబార్లపల్లికి చెందిన క్రిష్ణప్ప, కమ్మేపల్లికి చెందిన షేక్ ఇలియాజ్, కర్ణాటక రాష్ట్రం కోలార్‌కు చెందిన మునీష్, చౌడేపల్లి మండలం, మేకలచిన్నేపల్లికి చెందిన విజయ్‌కుమార్, రాజులూరు గ్రామానికి చెందిన శంకర్, పెద్దపంజాణి మండలం, గౌనివారిపల్లికి చెందిన నాగరాజు మొత్తం ఆరుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి రైస్ పుల్లింగ్ పేరుతో ప్రజలను మోసగిస్తూ వస్తున్నారు. వారి వద్ద రైస్ పుల్లింగ్‌కు అవసరమైన పాత వస్తువులు, నాణేలు, బ్యాటరీలు తదితర వస్తువులను ఉన్నట్టు వెల్లడించారు.
గుట్టు ఎలా రట్టయ్యిందంటే!
తమిళనాడు రాష్ట్రం, కృష్ణగిరి జిల్లా, బరుగూరు సూరంకుటై గ్రామానికి చెందిన శేఖర్‌తో రైస్ పుల్లింగ్ ముఠా సంప్రదింపులు జరిపింది. రాయలపేట దగ్గర ఆంజనేయస్వామి గుడి వద్దకు వస్తే తమ దగ్గర ఉన్న మహిమ గల చెంబు ఇస్తామని నమ్మబలికారు. చెంబు దక్కితే కోటీశ్వరుడవుతావని, లేకపోయినా బాగా డబ్బులు సంపాదిస్తావని చెప్పారు. దీంతో శేఖర్ తమిళనాడు నుంచి రాయలపేట వద్దకు రాగా.. రైస్‌పులింగ్ ముఠా మహిమ గల చెంబు పేరుతో రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. కేటుగాళ్ల మాయమాటలను నమ్మిన బాధితుడు ముందుగా రూ.లక్ష చెల్లించి చెంబు దక్కించుకున్నాడు. ఆ తర్వాత చెంబుని పరిశీలించగా అది పనికిరాని చెంబని తెలుసుకుని బోరుమన్నాడు. తనకు డబ్బు ఇచ్చేయాలని గట్టిగా ఆ ముఠాని నిలదీయడంతో అందురూ అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయమై బాధితుడు పెద్దపంజాణి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ మారెప్ప, పోలీసులు గాలించగా ఆఖరుకి పంజాణి మండలం, కోగిలేరు క్రాస్ వద్ద నలుగురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పట్టుబడ్డ నలుగురిలో క్రిష్ణప్ప, విజయ్‌కుమార్, మునీష్, ఇలియాజ్ ఉన్నారు. శంకర్, నాగరాజు పరార్‌లో ఉన్నారు.
మాయమాటలు నమ్మకండి
మోసపూరిత మాటలు ఎవరూ కూడా నమ్మవద్దని సీఐ తెలిపారు. ఎవరైనా ఈ విధమైన ఆఫర్లు, ప్రలోభాలకు గురిచేస్తే వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లోగానీ లేదా డయల్ 112కి సమాచారం ఇవ్వాలని సూచించారు.


