పుత్తూరు మార్కెట్ యార్డులో గత మంగళవారం ప్రారంభించిన వారపు సంత ఎందుకు వచ్చిన తంటా అన్న చందాన తయారైంది. ఇటు రైతులు, అటు కొనుగోలుదారులు తంటాలు పడ్డారు. ముగ్గుపిండితో గీతలు గీసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదే మీ అంగళ్లకు హద్దులు అంటూ రైతులకు చూపి చేతులు దులుపేసుకున్నారు. సంత ప్రాంగణంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం లైట్లు వేసుకొనే మౌలిక వసతి కల్పించకపోవడంతో రైతులతో పాటు వినియోగదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఎండలు మండుతున్న వేళ కేవలం సాయంత్రం వేళ వ్యాపారులు అమ్మకాలకు ఉపక్రమిస్తుండగా సంత ప్రాంతంలో లైట్లు లేకపోవడంతో టార్చిలైట్ల వెలుతురులో వ్యాపారాలు సాగించారు. ఇకనైనా సంతలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని రైతులతోపాటు వినియోగదారులు కోరుతున్నారు.
– పుత్తూరు


