చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కార్యాలయ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించారని జిల్లా ఉపాధి అధికారిణి పద్మజ తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఉపాధి కార్యాలయ ఆధ్వర్యంలో నిర్వహించే ఆన్‌లైన్ పోర్టల్‌లో నిరుద్యోగులు తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. కొత్తగా ఉపాధి కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలనుకునే వారు ఎంప్లాయ్‌మెంట్.ఏపీ.జీవోవీ.ఇన్ (www.-employment.ap.gov.in)సందర్శించాలన్నారు. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న వారు నిర్ణీత గడువు లోపు సీనియారిటీని పునరుద్ధరణ చేసుకోవాలని తెలిపారు. నిరుద్యోగులు తమ విద్యార్హతలలో వచ్చిన మార్పులను, అదనపు అర్హతలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించారన్నారు. ఇతర వివరాలకు 9440044346 నెంబర్‌లో సంప్రదించాలని ఆమె కోరారు.
మేమున్నామని..
మీకేం కాదని!
– ఆత్మహత్య చేసుకోబోతున్న బాలికను రక్షించిన పోలీసులు
కార్వేటినగరం: ఆత్మహత్య చేసుకోబోతున్న బాలికను పోలీసులు రక్షించిన ఘటన మండల పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. కార్వేటినగరం మండలానికి చెందిన మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్‌డూడి నాయకత్వంతో పనిచేస్తున్న సోషల్ మీడియా సిబ్బంది ఆ పోస్టును గమనించారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. కార్వేటినగరం సీఐ హనుమంతప్ప తమ సిబ్బందితో కలసి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బాలిక ఆచూకీని గుర్తించారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే బాలిక వద్దకు చేరుకుని సురక్షితంగా రక్షించారు. అనంతరం బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. కౌనెల్సింగ్ ఇచ్చి.. భవిష్యత్‌లో చదువుపై దృష్టి పెట్టాలని, చదువు లేదా ఉపాధి విషయంలో అవసరమైన సహాయం పోలీసుల ద్వారా అందిస్తామని భరోసా కల్పించారు. పోలీసులకు బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
టమాట బాక్స్ రూ.400
పలమనేరు: పలమనేరు మార్కెట్‌లో సోమవారం టమాట బాక్సు (14 కిలోలు) ధర రూ.400 పలికింది. గత నాలుగు రోజుల క్రితం బాక్సు రూ.200 ఉండగా రోజుకి యాభై చొప్పున పెరుగుతూ సోమవారం నాటికి టాప్‌రేట్‌కు చేరింది. దీంతో రైతులు ఆనందంతో చిందులేస్తున్నారు. టమాట సాగయ్యే రాష్ట్రాల్లో సరుకు తగ్గడం, అనంతపూర్ జిల్లాలో ఎండల కారణంగా దిగుబడి తగ్గడంతో సరుకు ఇక్కడి మార్కెట్లకు రావడం లేదు. అందుకే బయటి వ్యాపారులు సైతం స్థానిక మార్కెట్లకు వస్తున్నారు. వచ్చే నెలలో ధరలు మరింత పెరిగే అవకాశమున్నట్టు వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
పోలీసు గ్రీవెన్స్‌కు
44 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 44 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ తుషార్‌డూడీ తెలిపారు. వీటిలో కుటుంబ తగాదా లు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూతగా దాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నట్టు వెల్లడించారు. ప్రతీ ఫిర్యాదును నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూ డాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా స్టేషన్‌హౌస్ అధికారులతో మాట్లాడారు. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖరరాజు, చిత్తూరు డీఎస్పీ వెంకట నారాయణ సైతం ఫిర్యాదులను తీసుకున్నారు.


