క్లుప్తంగా
ప్రజలను ఏమార్చలేరు!
నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో మంగళవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా అగ్నిమాపకశాఖాధికారి పెద్దిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పేర్కొన్నారు.
బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి నగరంలోని కట్టమంచి, తేనెబండ, గిరింపేట తదితర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ముందస్తుగా దీని సమాచారంతో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న వ్యక్తులపై నిఘా ఉంచి పక్కా సమాచారంతో దాడులు చేశారు. ఈ దాడుల్లో వన్ టౌన్ టూ టౌన్ పరిధిలోని ఐదుగురు బెట్టింగ్ నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల మొబైల్ ఫోన్ ఆన్‌లైన్‌లో తనిఖీ చేయగా దాదాపు రూ.కోటికి పైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రూ.50 వేల వరకు నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటి వెనుక ఉన్న పలువురిపై కేసు నమోదు చేసి.. నిందితుల కోసం కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పూతలపట్టులో
విజిలెన్సె దాడులు
– నాలుగు సిలిండర్లు స్వాధీనం
పూతలపట్టు(యాదమరి): పూతలపట్టులోని పలు దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు సోమ వారం మెరుపు దాడులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్న వారిపై నిఘా ఉంచి నాలుగు సిలిండర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తిరుపతి ఎన్‌ఫోర్స్‌మెంట్ నిఘా అధికారి కరిముల్లా ఆదేశాలు మేరకు విజిలెన్స్ ఎస్‌ఐ వెంకటరమణ, పౌరసరఫరాల డీటీ మోహన్‌రాజు సమక్షంలో మండల కేంద్రంలోని పలు దుకాణాలను తని ఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వినియోగిస్తున్న నాలుగు సిలిండర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్‌ఐ మాట్లాడుతూ.. వాణిజ్య అవసరాల నిమిత్తం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను ఉపయోగించినా లేదా నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చ రించారు. ఈ దాడుల్లో వీఆర్వో నాగేంద్ర పాల్గొన్నారు.
ముగ్గురికి జైలు
తిరుపతి లీగల్: ఎరచ్రందనం దుంగల అక్రమ రవాణా కేసులో ముగ్గురికి రెండేళ్లు వంతున జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జూనియర్ జడ్జి శ్రీకాంత్ సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. 2011 ఏప్రిల్ 22వ తేదీ బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు బుచ్చిరెడ్డిపాలెం, జొన్నవాడ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. పోలీసుల తనిఖీల్లో ఓ టిప్పర్‌లో 78 ఎరచ్రందనం దుంగలు తరలిస్తుండగా గుర్తించారు. పిచ్చాటూరు మండలం, కీలపూడికి చెందిన బి వెంకటాచలం, అదే మండలం రామగిరికి చెందిన గోపాల్ రెడ్డి శంకర్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాళెం మండలం, ఖాజానగర్‌కు చెందిన షేక్ షాకీర్ వాహనంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. ముగ్గురిని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు రేంజ్, సంగం సెక్షన్ ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. ఫారెస్ట్ సిబ్బంది ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ముగ్గురిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ముగ్గురికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
ఆశపడ్డాం
మాది పేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడదు. నేను పండ్ల వ్యాపారం చేస్తుంటాను. ఇద్దరు పిల్లల్ని కష్టపడి చదువించుకుంటున్నా. మా ఆయన వ్యవసాయం చేస్తాడు. ఆర్థిక పరిస్థితి సరి లేక ఇబ్బందులు పడుతున్నాం. ఆడబిడ్డ నిధి రూ.1,500 వస్తుందని ఆశపడ్డాం. కానీ ఏం లాభం.. ఇంతవరకు ఆ ఊసే లేదు.
– లత. ఆముదాల దళితవాడ, పాలసముద్రం మండలం
ఇంటి జాగా, పెన్షన్ లేదు
మాకు సొంత ఇల్లు కూడా లేదు. వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేశాను. రాలేదు. కనీసం ఇంటి స్థలమైనా వస్తుందేమోనని ఎదురు చూస్తున్నా. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 వస్తే మాకు ఒకింత వెసులుబాటు ఉంటుంది.
– బుజ్జమ్మ, బలిజకండ్రిగ దాసరి కాలనీ, పాలసముద్రం మండలం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చింది. పాలనలో సవాలక్ష మార్పులు చేసింది. ఇందులో భాగంగా రేషన్ సరుకులు వాహనాల ద్వారా ఇళ్ల వద్దకే వచ్చి ఇచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటన్నింటినీ నామరూపాలు లేకుండా చేస్తోంది. బియ్యం బండి వాహనానికి రంగులు మార్చి స్వచ్ఛరథం అంటూ రోడ్లపై తిప్పుతోంది. వీటిని చూసిన జనాలు ఔరా..! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. – పాలసముద్రం
మే1 నుంచి వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: నాగలాపురంలోని వేదవల్లీ సమేత వేదనారాయణ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మే 1 నుంచి 9వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈనెల 30వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 28వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు నిర్వహించనున్నారు. మే ఒకటో తేదీ ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేష వాహనం, 2న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహన సేవలు జరుగుతాయి. అలాగే 3వ తేదీ ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనం, 4న ఉదయం కల్పవృక్ష వాహనం రాత్రి సర్వభూపాల వాహనం, 5న ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం, 6న ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహన సేవలు నిర్వహించనున్నారు. మే నెల 7వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 8న ఉదయం 6 నుంచి 10.30 గంటల వరకు రథోత్సవం, సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు ఆర్జిత కల్యాణోత్సవం, రాత్రి అశ్వవాహనసేవలు జరగనున్నాయి. మే 9వ తేదీన ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం వాహన సేవలు ఉంటాయి. మే 8వ తేదీన సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొన దలిచిన గృహస్తులు (ఇద్దరు) రూ.750 చెల్లించి పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.
రైల్వే అండర్ బ్రిడ్జి మూసివేత
–ఇక్కట్లు పడుతున్న వాహనదారులు
రేణిగుంట: పట్టణంలోని శ్రీనివాస కాలేజీ సమీపంలో ఉన్న బ్రిడ్జిని మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం మూసివేశారు. దీంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బ్రిడ్జి మూసివేయడంతో వాహనచోదలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని కేటాయించారు. అయితే ప్రత్యామ్నాయ మార్గంలో ఉన్న సంత వద్ద రైల్వేగేట్ తరచూ మూసివేస్తుండడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. రైల్వేగేట్ మూసివేసినప్పుడల్లా రెండు వైపులా వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో వాహనచోదకులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో గేటుకు రెండు వైపులా వాహనాలు నిలవడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర పనులపై వెళ్లే వారు ఈ ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర ఆధ్వర్యంలోని పోలీసులు రైల్వేగేట్‌కు రెండు వైపులా ఉండి వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నారు. అయినా రద్దీ తగ్గడం లేదు. ఈనెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకూ మరమ్మతుల కారణంగా బ్రిడ్జి మూసి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
శ్రీవారి దర్శనానికి 08 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 20 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 77,743 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,376 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.59 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 08 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలులో అలసత్వం చూపొద్దని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో 100 శాతం సంతృప్తి కలిగించేలా అధికారులు పనిచేయాలన్నారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాలో పర్యటించనున్నారని చెప్పారు. ఆ సమయంలో క్షేత్రస్థాయి అధికారులతో సీఎం ప్రత్యక్షంగా సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయి, ప్రజల సంతృప్తి ఏ స్థాయిలో ఉందనే అంశాలపై ఐవీఆర్‌ఎస్ సర్వేల ఆధారంగా సమీక్ష ఉంటుందన్నారు.
ఎండలతో జాగ్రత్త
జిల్లాలో రాబోయే 5 రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఉదయం 10 గంటల్లోపే పనులను పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, కమిషనర్‌లు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి నిధుల కొరత లేదన్నారు. జెడ్పీ నిధుల నుంచి మంజూరు చేస్తామన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్‌లు అందించాలన్నారు.
ప్రతి పీహెచ్‌సీకి ఇంటర్‌నెట్ సౌకర్యం
జిల్లాలోని ప్రతి పీహెచ్‌సీకి రూ.25 వేలతో ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకు కలెక్టర్ నిధుల నుంచి ఒక్కో కేంద్రానికి రూ.25,000 కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్‌నెట్ సౌకర్యం వల్ల అబా ఐడీల క్రియేషన్, రోగుల రిజిస్ట్రేషన్, రిపోర్టుల అప్‌డేట్ ప్రక్రియ సులభతరం అవుతుందన్నారు. ఓపీకి వచ్చే ప్రతి రోగి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. డాక్టర్‌లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్‌లు అందరూ 100 శాతం డిజిటల్ డేటా ఎంట్రీ చేయాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డీఆర్‌వో మోహన్‌కుమార్, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ నాగశశిభూషన్‌రెడ్డి, డీఎస్‌వో గిరి తదితరులు పాల్గొన్నారు.
న్యాయం చేయండి సారూ!
చిత్తూరు కలెక్టరేట్ : ‘న్యాయం చేయండి సారూ..’ అంటూ అర్జీదారులు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు అయినప్పటికీ పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు తరలివచ్చారు. అధికారులు లేకపోయేసరికి చేసేదేమీలేక వెనుదిరిగారు.


