చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సౌత్‌జోన్ అంతర్ విశ్వవిద్యాలయ క్రీడల్లో ప్రతిభ చాటారు. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ తరఫున సౌత్‌జోన్ అంతర్ విశ్వవిద్యాలయ క్రీడల్లో 8 మంది పీవీకేఎన్ విద్యార్థులు పాల్గొని విశేష ప్రతిభ కనబరిచారు. సాఫ్ట్‌బాల్‌లో 4, ఖోఖోలో 3, హాకీలో ఒక విద్యార్థి ప్రతిభ చాటారు. ఈ క్రీడా పోటీలు మహారాష్ట్రలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో, కర్ణాటకలోని దావణగెరే విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ప్రతిభ చాటిన విద్యార్థులను ప్రిన్సిపల్ డా.జీవనజ్యోతి అభినందించారు. ఆమె మాట్లాడుతూ క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా, విద్యార్థుల భవిష్యత్‌కు, ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడా కోటా అవకాశాలకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ నాగేంద్ర, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇంచార్జి రమేష్, అధ్యాపకులు భానుప్రకాష్, శరవణ, తదితరులు పాల్గొన్నారు.
పర్యాటకులపై చెక్‌పోస్టు సిబ్బంది దాడి
పుత్తూరు: నేసనూరు పంచాయతీ పరిధిలోని మూలకోన సందర్శనార్థం వచ్చిన పర్యాటకులపై అటవీశాఖ చెక్‌సోస్టు సిబ్బంది దాడి చేసిన ఘటనపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాలు ఇలా ఉన్నాయి. పుత్తూరు పట్టణం, ఎంబీ రోడ్డుకు చెందిన వి.మునిలక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలసి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆటోలో మూలకోనకు వెళ్లారు. చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ మరో వ్యక్తి ఆటో రుసుం రూ.100, ఒక్కో వ్యక్తికి రూ.10 వంతున చెల్లించాలని కోరగా వారు నగదు చెల్లించారు. ఆటోను చెక్‌చేసి మాంసం ఆలయం వద్దకు అనుమతి లేదని శ్రీకాంత్ తేల్చి చెప్పాడు. తాము ఆలయం వద్దకు తీసుకెళ్లమని, దూరంగా వెళ్లి తీసుకొంటామని పర్యాటకులు తెలిపారు. దీనిపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కోనలోకి వెళ్లి సాయంత్రం తిరుగు ప్రయాణ సమయంలో చెక్‌పోస్టు సిబ్బంది అప్పటికే పక్క గ్రామం నుంచి పిలిపించుకొన్న నలుగురు వ్యక్తులతో కలసి మునిలక్ష్మి(49), రమ్య (27), సుమతి(32), శాంతి(46), జానకీరామ్(28), రాకేష్(22)పై కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ బాధితులు ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు జరుగుతోంది.


