గత ఏడాది ప్రారంభించిన రైతు బజార్ ఇప్పటి వరకు మొదలు కాని వ్యాపారాలు బోసిపోతున్న 16 దుకాణ గదులు ప్లాట్ ఫామ్ పైనే అంగళ్లు జగన్‌కు మంచి పేరు వస్తుందనే నిర్లక్ష్యం జగన్ మంచి చేయడం తప్పా అని అంటున్న రైతులు
నిరుపయోగంగా
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలుచేసింది. వారి సౌకర్యం కోసం పలు పనులు చేపట్టింది. అవి ఎంతో ఉపయోగపడ్డాయి. సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే పలమనేరులో నిర్మించిన రైతు బజార్‌ను ఇప్పటికీ వినియోగంలోకి తీసుకురాలేదు. రూ.లక్షలతో నిర్మించిన గదులు నిరుపయోగంగా మారాయి. రైతు బజార్‌ను వినియోగంలోకి తీసుకువస్తే జగన్‌కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఇలా చేస్తోందని స్థానికులు అంటున్నారు.
మాకు దుకాణాలు ఇవ్వండి
వందలాది మంది రైతులు కూరగాయలను ప్రతి రోజూ పలమనేరు మార్కెట్‌కు తీసుకువచ్చి వ్యాపారులకు కమీషన్ ఇచ్చి అమ్ముకోవాల్సి వస్తోంది. రైతు బజార్‌లో దుకాణాలను రైతులకు ఇస్తే నేరుగా కూరగాయలు అమ్ముకుంటారు. తద్వారా వ్యాపారులకు ఇచ్చే కమీషన్ మిగులుతుంది. గిట్టుబాటు ధర అందుతుంది. ప్రజలకు తాజా కూరగాయలు లభిస్తాయి. దీనిపై అధికారులు ఆలోచించాలి.
– అమరనాథ రెడ్డి, రైతు, కంచిరెడ్డిపల్లి
పలమనేరు: గత ప్రభుత్వంలో పలమనేరు పట్టణంలోని వారపు సంతలో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రూ.26 లక్షలతో రైతు బజార్‌ను నిర్మించారు. ఇందులో 16 గదులను ఏర్పాటుచేశారు. అందులో అన్ని సౌకర్యాలు కల్పించారు. దీన్ని గత ఏడాది మార్చి 8వ తేదీన స్థానిక ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ప్రారంభించారు. సమావేశంలో మాట్లాడుతూ ఇందులో రైతులు, వ్యాపారులు, మహిళా సమాఖ్య సభ్యులు కూరగాయల దుకాణాలు పెట్టుకోవచ్చని చెప్పారు. వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. రైతు బజార్‌లో వ్యాపారాలు కొనసాగిస్తే వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేసిన అభివృద్ధి కనిపిస్తుందని కూటమి నాయకులు భావించారు. అందులో భాగంగా దాన్ని ప్రాంభించి వదిలేశారు. ఇక్కడ వ్యాపారాలు చేసేందుకు వ్యాపారులు, రైతుల ముందుకు రావడం లేదనే మాటను అధికారుల ద్వారా చెప్పిస్తున్నారు. మాకు రోడ్లపైనే వ్యాపారం బాగా సాగుతోందని కొందరు, మాకు దుకాణాలకు అవకాశం ఇవ్వలేదని మరికొందరు వ్యాపారులు చెబుతున్నారని పేర్కొంటున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకుని రైతు బజార్‌ను వినియోగంలోకి తీసుకువస్తే వ్యాపారాలు చేసుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని వ్యాపారులు చెబుతున్నారు.
బాగా సాగుతున్న వారపు సంత
రైతు బజార్‌ను నిర్మించిన చోటే వారపు సంత ప్రతి శుక్రవారం జరుగుతుంది. ఈ సంతలో 300లకు పైగా దుకాణాలు నిర్వహిస్తున్నారు. పట్టణ వాసులు వారానికోసారి సంతకు వచ్చి అవసరమైన కూరగాయలు, సరుకులు తీసుకు వెళుతున్నారు. సంతకొస్తున్న జనం రైతు బజార్‌కు ఎందుకు రారనే ప్రశ్న తలెత్తుతోంది. మరో వైపు దినసరి మార్కెట్‌ను దక్కించుకున్న వ్యాపారులు సైతం రైతు బజార్ రాకుండా చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఏది ఏమైనా మున్సిపల్, మార్కెటింగ్ శాఖ అధికారులు తగిన చొరవచూపి రైతు బజార్‌ను వినియోగంలోకి తీసుకువచ్చి అక్కడ వ్యాపారాలు జరిగేలా చూడాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
ప్లాట్‌ఫామ్‌లపై 50 దుకాణాలు
పట్టణంలోని వారపు సంత, మున్సిపల్ ఆఫీసు, గంగమ్మ గుడి వీధి, చర్చి పక్కన, సూపర్ బజార్ వద్ద దాదాపు 50 మంది చిరువ్యాపారులు ప్లాట్ ఫామ్‌పైనే కూరగాయలను విక్రయిస్తున్నారు. వీరిని రైతు బజార్‌కు పంపితే అక్కడ వ్యాపారాలు జరుగుతాయి. అధికారులు రైతు బజార్‌ను వినియోగంలోకి తీసుకురాకపోవడంతో వ్యాపారాలు అక్కడికి వెళ్లడానికి సుముఖత చూపడం లేదు.


