ఉష్ణోగ్రతలతోపాటు విద్యుత్ వాడకం పెరగడంతో లోడును తట్టుకోలేక ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటికి ట్రాన్స్‌కో సిబ్బంది సకాలంలో మరమ్మతులు చేయడం లేదు. దీంతో పంటలకు నీరు అందించలేక రైతులు అల్లాడుతున్నారు. చిత్తూరు జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,650 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. మార్చిలో ఎండలు పెరగడంతో ఇప్పటికి 600లకు పైగా ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురయ్యాయి. వాటిని సొంత ఖర్చులతో తీసుకువచ్చినా సకాలంలో రిపేర్లు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు కార్పొరేషన్: చిత్లూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 25/63/100 కేవీఏ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్లు, పట్టణ ప్రాంతాల్లో 100/160/250 కేవీఏ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్లను వినియోగిస్తున్నారు. అవి కాలిపోతే మరమ్మతుల కోసం సగటున కేవీఏకు రూ.200 చొప్పున ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యానికి తగిన మొత్తాన్ని కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే రూ.15 వేల నుంచి రూ.20 వేలు ట్రాన్స్‌కో ఖర్చు చేయాల్సి వస్తోంది. ట్రాన్స్‌ఫార్మర్‌లో కాలిపోయిన వైండింగ్ స్థానంలో కొత్త వైండింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఆయిల్‌ను ఫిల్టర్ చేసి వేస్తారు. ఒక్కోసారి పూర్తి వైండింగ్ కాలిపోతే ఖర్చు అధికమవుతుంది. కొత్త ట్రాన్స్‌ఫార్మర్లకు ఐదేళ్ల వారంటీ ఉంటుండగా, కాలిపోయిన వాటికి మరమ్మతులు చేసిన తర్వాత ఆరు నెలల గ్యారెంటీ పిరియడ్ ఉంటుంది. గ్యారెంటీ పిరియడ్ లేని ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే పూర్తి వ్యయం ట్రాన్స్‌కో భరించాల్సి ఉంటుంది. జిల్లాలో 1650 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. వాటిలో 15 కేవీఏ సామ ర్థ్యం గలవి 116 ట్రాన్స్‌ఫార్మర్లు, 16 కేవీఎ సామర్థ్యం ఉన్నవి 673, 25 కేవీఏవి 751 ఉన్నాయి. చిత్తూరు, కార్వేటినగరం, పుంగనూరు, పలమనేరు ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ రోలింగ్ స్టాక్ సిద్ధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినప్పుడు ఇక్కడికి తీసుకుస్తారు. రైతులకు రోలింగ్ స్టాక్‌లో నుంచి ట్రాన్స్‌ఫార్మర్ అందజేసి తదుపరి మరమ్మతులు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఇవ్వాలి. నగరానికి సంబంధించిన ట్రాన్స్‌పార్మర్‌ను ఒక రోజు, గ్రామాలకు చెందిన వాటిని రెండు రోజుల్లో మరమ్మతు చేయాలి. వీటికి ఎలాంటి పైకం తీసుకోకూడదు. ట్రాన్స్‌కో వాహనం ద్వారా రవాణా చేస్తామని ప్రతి ఎస్‌పీఎం (ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రం) వద్ద నోటీసు బోర్డులో రాసి ఉంటుంది. అది రాతలకు మాత్రమే పరిమితమైంది. రోజూ పదుల సంఖ్యలో కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లను రైతులు సొంత వాహనాల్లో సంబంధిత కేంద్రాలకు తీసుకువస్తున్నారు. వాటిని తొందరగా రిపేర్లు చేయాలంటే చేయి తపడాల్సిందేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమయానికి ట్రాన్స్‌ఫార్మర్లు రాక పంటలకు నీరు పెట్టలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
సకాలంలో రిపేర్లు చేయాలి
ఎండా కాలంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ట్రాన్స్‌ఫార్మర్లకు సకాలంలో మరమ్మతులు చేయాలి. మరమ్మతు కేంద్రాల్లో రోలింగ్ స్టాక్‌ను సిద్ధంగా పెట్టుకోవాలి. రైతులు తమ వాహనాలతో కేంద్రాల వద్దకు వస్తున్నారు. సేవలకు ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సమస్యల పై ఫిర్యాదు చేయండి.
– ఇస్మాయిల్‌అహ్మద్, ఎస్‌ఈ ట్రాన్స్‌కో


