చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ చేపట్టామని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఆయన శనివారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో మొత్తం 15,78,617 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.
ఓటరు నమోదులో అగ్రస్థానం
ఓటరు నమోదు, దరఖాస్తుల పరిష్కారంలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉందని కలెక్టర్ తెలిపారు. 18 ఏళ్లు నిండిన యువతను ఓటర్లుగా చేర్చే ప్రక్రియ సంతృప్తికరంగా సాగుతోందన్నారు. నగరిలో పెండింగ్‌లో ఉన్న 35 ఫారమ్స్‌కు అనుమతి కోరుతూ సీఈవో కార్యాలయానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. మరణించిన వారు, బోగస్ ఓటర్ల పేర్లను తొలగించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఇందుకు బూత్ లెవల్ ఏజెంట్లను (బీఎల్‌ఏ) నియమించుకోవాలని చెప్పారు. వారు బీఎల్‌వోలతో సమన్వయం చేసుకుంటూ జాబితాలోని తప్పులను సరిదిద్దాలని సూచించారు.
పారదర్శకంగా ప్రక్షాళన
జిల్లాలోని 1,776 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటరు జాబితా ప్రక్షాళన పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. బీఎల్‌వోలు ఇప్పటికే 76 శాతం మ్యాపింగ్ పూర్తి చేశారన్నారు. రాజకీయ పార్టీలు వాస్తవాలను తెలియజేస్తే మరింత పక్కాగా జాబితాను సిద్ధం చేయవచ్చన్నారు. డీఆర్‌వో మోహన్‌కుమార్, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ రాజేంద్ర, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉదయ్, సురేంద్ర, అట్లూరి శ్రీనివాసులు, పరదేశి, గంగరాజు పాల్గొన్నారు.


