జిల్లాలో ఆస్తి పన్ను
వసూలైంది 50 శాతమే
చిత్తూరు అర్బన్: మునిసిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్ల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు మూడు మునిసిపాలిటీల్లో రూ.32.32 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఈ నెలాఖరుకు గడువు ముగుస్తుండడంతో కనీసం 80 శాతం పన్నులైనా వసూలవుతుందా..? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొందరు కమిషనర్లు గతేడాదితో పోలిస్తే ఈ సారి పన్ను వసూళ్లలో పురోగతి ఉందంటూ ఆన్‌లైన్‌లో గ్రాఫ్‌లు చూసుకుంటూ మురిసిపోతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో అస్సలు పట్టించుకోవడం లేదు.
చిత్తూరులోనే ‘భారీ’ బకాయిలు
జిల్లాలో మూడు మునిసిపాలిటీలతో పాటు చిత్తూరు కార్పొరేషన్ నుంచి ఈ మార్చి 31వ తేదీలోపు రూ.64.68 కోట్లు ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉంది. ప్రభుత్వం ప్రకటించిన 50 శాతం వడ్డీ మాఫీతో అప్పటి వరకు వడ్డీని పూర్తిగా మాఫీ చేస్తారని భావించిన ప్రజలకు నిరాశనే మిగిల్చింది. అయితే రూ.64.68 కోట్ల లక్ష్యంలో ఇప్పటి వరకు రూ.32.36 కోట్లు వసూలైంది. ఇంకా రూ.32.32 కోట్లు వసూలు కావాల్సి ఉంది. మొత్తం లక్ష్యంలో ఒక్క చిత్తూరు కార్పొరేషన్ నుంచి రూ.46.08 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇందులో గతేడాది ఏప్రిల్ 1 నుంచి బుధ, గురురాల నాటికి రూ.21.65 కోట్లు వసూలు చేశారు. ఇంకా దాదాపు రూ.24 కోట్లకు పైనే బకాయిలున్నాయి. చిత్తూరు కార్పొరేషన్‌లో మూతబడ్డ సహకార చక్కర ఫ్యాక్టరీ, విజయా డెయిరీ పాత బకాయిలు, కలెక్టరేట్ కార్యాలయ బకాయిలు.. ఇలా ప్రభుత్వ భవనాల నుంచే రూ.10 కోట్ల వరకు వసూలు కావాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉన్న బకాయిలపై ప్రతీ ఏటా కొత్త బకాయిలు పెరిగిపోతున్నాయి.
నాలుగు రోజుల్లో రూ.32 కోట్లు?
మార్చి 31తో 2025–26 ఆర్థిక సంంత్సరం ముగుస్తుండడంతో మునిసిపాలిటీల్లో వసూలు కావాల్సిన ఆస్తి పన్ను వసూళ్లకు నాలుగు రోజులే సమయం ఉంది. ఈ నాలుగు రోజుల్లో రూ.32.32 కోట్లు వసూలు కావాల్సి ఉంది. పలమనేరు నుంచి రూ.2.13 కోట్లు, కుప్పంలో రూ.3.37 కోట్లు, నగరిలో రూ.2.39 కోట్లు, చిత్తూరులో రూ.24 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. మొండి బకాయిల వసూళ్లకు ఇప్పటి వరకు ఏమైనా ప్రత్యేక చర్యలు, ప్రణాళికలు తీసుకున్నారా..? అంటే ఏ అధికారి వద్ద సమాధానం లేకపోవడం గమనార్హం.


