నిధుల లేమి?
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో కార్వేటినగరం డైట్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఇక్కడ దాదాపు తెలుగు, తమిళ భాషలకు సంబంధించి 260 మందికి పైగా ఛాత్రోపాధ్యాయులు శిక్షణ తీసుకునే వారు. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ డైట్‌పై శీతకన్ను వేయడం, ప్రైవేటు కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా ఇక్కడ దయనీయ పరిస్థితి నెలకొంది. ఇక్కడ డైట్‌లో రక్షణ కొరవడింది. బయటి వ్యక్తులు సైతం డైట్ వసతి గృహంలో ఉంటున్నట్టు సమాచారం. ఇప్పటికై నా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి డైట్‌లో వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కార్వేటినగరం : కార్వేటినగరంలోని జిల్లా ఉన్నత విద్య శిక్షణ సంస్థ(డైట్)లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నత విద్యాశాఖ అధికారులు డైట్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా తయారైంది. సాయంత్రం ఆరు గంటలు దాటితే అంధకారం నెలకొంటోంది. వీధి లైట్లు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు చీకట్లో కాలం వెల్లదీయాల్సి వస్తోంది. వసతి గృహం నుంచి అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాలంటే భయాందోళనకు గురవుతున్నట్టు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట విష పురుగుల సంచారం అధికంగా ఉండడంతో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సి వస్తోందని వాపోతున్నారు. సెల్ ఫోన్ల వెలుతురులో బయటకు రావాల్సి వస్తోందని చెబుతున్నారు.
కార్వేటినగరంలోని డైట్‌లో మొత్తం 67 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. పక్కనే ఉన్న ఆదర్శ పాఠశాలలో సుమారు వంద మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ అరకొర వసతుల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల డైట్ ఆవరణలో కొండ చిలువ సంచరించడంతో విద్యార్థులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మనీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
మట్టి తోలి మాయ చేశారు
డైట్‌లో పల్లపు ప్రాంతంలో వర్షపు నీరు నిలుస్తూ గుంతను తలపించేది. ఈ సమస్యను విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన కలెక్టర్ రూ.10 లక్షల ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. కాంట్రాక్టర్ అధికారులతో కుమ్మకై ్క మట్టి తోలి చదును చేయకుండా చేతులు దులుపుకున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. భవనాలు పెయింటింగ్ వేసి రూ.లక్షలు స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిటికీలకు మెస్‌లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా కాంట్రాక్టర్ పనులు చేయలేదన్నారు. అలాగే సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను తొలగించారు. వాటి స్థానంలో నూతనంగా గదుల నిర్మాణం కోసం మట్టిని తవ్వి వదిలేసినట్లు విమర్శలు ఉన్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి డైట్‌లో జరిగిన నిధుల గోల్‌మాల్‌పై విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మురికి కూపంలా డైట్
డైట్‌లో పారిశుద్ధ్యం లోపించింది. నీటి ట్యాంకు వద్ద నీరు వృథాగా పోతుండడంతో బురదమయంగా మారింది. ట్యాంకు చుట్టూ పాచి పట్టి దుస్థితికి చేరింది. దోమలు వృద్ధి చెంది రాత్రిళ్లు దాడి చేస్తుండడంతో సరిగ్గా నిద్ర పట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ట్యాంకును శుభ్రం చేయడంతోపాటు నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు.


