చిత్తూరు కలెక్టరేట్ : ఎస్సీ, ఎస్టీల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని, అలసత్వం వహిస్తే సహించమని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ, వారికి అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అట్రాసిటీ కేసుల విచారణ పక్కాగా చేపట్టాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం అందించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచే యాలని ఆదేశించారు. అట్రాసిటీ కేసుల నమోదు, విచారణలో జాప్యం లేకుండా చూడాలన్నారు. బాధితులకు అందాల్సిన నష్టపరిహారం సకాలంలో వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్య లు చేపట్టాలన్నారు. ఎస్సీ వసతి గృహాల మరమ్మ తులకు రూ.4.5 కోట్ల బకాయిలు చెల్లింపుల నిమి త్తం ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిపారు.
బాధితులకు అండగా ఉంటాం
అట్రాసిటీ కేసుల బాధితులకు అండగా ఉంటామని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. పెండింగ్‌లోని ఎస్సీ, ఎస్టీ కేసులను త్వరతిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో ట్రైనీ ఎస్పీ తురుణ్‌పహ్వా, డీఆర్‌ఓ మోహన్‌కుమార్, ఆర్‌డీఓలు, డీవీఎంసీ సభ్యులు రాజ్‌కుమార్, మునీంద్రనాయక్, వరలక్ష్మి తది తరులు పాల్గొన్నారు.


