స్వర్ణరథంపై స్వామివారిని ఊరేగిస్తున్న దృశ్యం
సంకటహర చతుర్థి వ్రతంలో పాల్గొన్న భక్తులు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో సంకటహర గణపతి వ్రతాన్ని శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రధాన ఆలయ అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తరువాత ఆలయ అధికారులు ఉత్సవమూర్తులను ఆస్థాన మండపానికి తీసుకెళ్లి కొలువుదీర్చారు. ఉదయం 9 నుంచి 10, 11 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని జరిపించారు.
స్వర్ణరథంపై చిద్విలాసం
వరసిద్ధి వినాయకస్వామి రాత్రి ఆలయ మాడ వీధుల్లో స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల నడుమ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లి స్వర్ణరథంలో కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూరహారతులతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈవో పెంచలకిషోర్, ఏఈఓ రవీంద్రబాబు పాల్గొన్నారు.


