గంగవరం : యువత మత్తుకు అలవాటు పడితే జీవితం చిత్తవుతుందని ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు. గురువారం మదర్‌థెరిస్సా ఇంజినీరింగ్ విద్యార్థులకు నో డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ పిల్లల్లో డ్రగ్స్ వాడకం పెరుగుతోందని, దీంతో తల్లిదండ్రులు, కళాశాల, జిల్లాతోపాటు రాష్ట్రానికి సైతం చెడ్డపేరు వస్తుందని తెలిపారు. మత్తుపదార్థాలకు దూరంగా ఉంటే జీవితకాలం సంతోషంగా ఉంటారని వెల్లడించారు. ఇన్‌స్ట్రాగాం, ఫేస్‌బుక్ వంటి యాప్స్‌లో డిజిటల్ అరెస్ట్, ఇన్‌వెస్ట్‌మెంట్ ఫండ్స్, ప్రీఫైర్, పబ్జీ వంటి ఆన్‌లైన్ గేమింగ్‌లో గ్యాంబ్లింగ్ అధికంగా ఉందన్నారు. వీటి జోలికి వెళ్లకపోవడం ఉత్తమమని సూచించారు. ముఖ్యంగా అమ్మాయిలు తమ పర్సనల్ డీటెయిల్స్‌ను వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్ట్సాగ్రాంలో పోస్ట్ చేయడం క్షేమం కాదని స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్లు వాటి ద్వారా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని ట్రాప్ చేసే ప్రమాదముందని హెచ్చరించారు. విద్యార్థినులు అత్యంత జాగ్రత్తలు తీసుకుని సేఫ్ జోన్‌లో ఉండాలన్నారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే లైసెన్సు, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్‌తో ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని సూచించారు. అందురూ బాగా చదువుకుని తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం విద్యార్థులకు హెల్మెట్లు ఉచితంగా అందజేశారు. ట్రైనీ ఐపిఎస్ తరుణ్‌పావా, డీఎస్పీ ప్రభాకర్, సీఐలు రాంభూపాల్, మోహన్‌రెడ్డి, కళాశాల కరెస్పాండెంట్ రవీంద్రబాబు, అకడమిక్ డైరెక్టర్ రాజేంద్రరెడ్డి, ప్రిన్సిపాళ్లు లక్ష్మీకాంతరెడ్డి, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.


