పలమనేరు: మండలంలోని క్రిష్ణాపురం సమీపంలోని అడవిలోంచి వచ్చిన ఒంటరి ఏనుగు గురువారం రాత్రి హల్‌చల్ చేసింది. పొలాల వద్ద కొందరు ఇళ్లను కట్టుకుని నివసిస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో వచ్చిన ఏనుగు వినాయకం పొలంలోని ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసి అక్కడున్న అరటి, పశుగ్రాసం, పక్కనున్న రైతులకు చెందిన మిరప తదితర పంటలను తిని, తొక్కి నాశనం చేసింది. ఏనుగును పసిగట్టిన కుక్కలు వెంటపడడంతో పొలాల వద్ద ఉన్న జనం అప్రమత్తమయ్యారు. ప్రాణభయంతో ఇంటి పైకప్పులపైకి చేరారు. కుక్కలు మొరిగే కొద్దీ చిర్రెత్తిన ఏనుగు వాటిని తరమడం.. ఘీంకారాలు పెడుతూ రైతుల ఇళ్ల వద్దే పొద్దున ఐదు గుంటల దాకా ఉండిపోయింది. ఆపై అడవిలోకి వెళ్లింది. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలా ఉండగా రాత్రిపూట త్రీఫేస్ కరెంటు సరఫరా చేస్తుడండంతో పలువురు రైతులు పంటలకు నీరందించేందుకు వెళుతుంటారు. ఇలాంటి సమయంలో వీరి ప్రాణాలకు భద్రత లేకుండాపోయింది. కుంకీలమాట దేవుడెరుగు ఇప్పటికై నా అధికారులు ఇంద్రానగర్ నుంచి చెత్తపెంట దాకా సోలార్ ఫెన్సింగ్ నిర్మించాలని రైతులు కోరుతున్నారు.


