డిస్పెన్సరీ..అంతేనా మరి!
కుర్చీలు లేవని...ప్రారంభోత్సవంతో సరిపెట్టేశారు పాత భవనంలోనే సేవలు కొనసాగింపు మండిపడుతున్న ఆర్టీసీ ఉద్యోగులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్‌లో నిర్మించిన నూతన డీస్పెన్సరీ ప్రారంభోత్సవానికే పరిమితమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలల క్రితం రవాణాశాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించిన ఈ భవనం ఇప్పటికీ వినియోగంలోకి రాకపోవడంతో ఉద్యోగులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభోత్సవం రోజునే కుర్చీలు, ఫర్నిచర్, అవసరమైన పరికరాలు లేవని తెలిసినా కార్యక్రమం నిర్వహించి మమ అనిపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ సాకుతో కొత్త భవనానికి మూత వేశారు. మూడు నెలలు గడిచినా.. ముచ్చటగా మూసిపెట్టేశారు. ఈ కారణంగా లోపల బూజు పట్టిన గోడలు, ఖాళీ గదులు మాత్రమే కనిపిస్తున్నాయి. మరోవైపు వైద్య సేవలు మాత్రం చిత్తూరు ఆర్టీసీ వన్‌డిపో ప్రాంతంలోని పాత భవనంలోనే కొనసాగుతున్నాయి. ఇలాంటప్పుడు ఎందుకు కొత్త భవనం కట్టారని ఆర్టీసీ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కొత్త భవనం సిద్ధంగా ఉన్నా ఉపయోగంలోకి తీసుకురాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు విమర్శిస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా చోద్యం చూస్తుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన ఫర్నిచర్, వైద్య పరికరాలు, సిబ్బందిని ఏర్పాటు చేసి నూతన డీస్పెన్సరీని అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.
మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం (ఫైల్)
ఆర్టీసీ బస్టాండులో నూతనంగా నిర్మించిన డిస్పెన్సరీ
చిత్తూరు ఆర్టీసీ బస్టాండులో నూతన డిస్పెన్సరీ
డిస్పెన్సరీ..అంతేనా మరి!


