దారుణం!
తప్పుడు పత్రాలు సృష్టించి మా భూమిపై రుణం తీసుకున్నారు
● డీసీసీబీ సీఈఓకు బాధితురాలి ఫిర్యాదు
చిత్తూరు రూరల్ (కాణిపాకం ): తమ భూములపై పోర్జరీ పత్రాలు సృష్టించి సహకార బ్యాంకులో రుణం నొక్కేశారని ఎస్‌ఆర్ పురం మండలం, 52 కనికాపురం గ్రామానికి చెందిన అమరావతి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం చిత్తూరు నగరంలోని డీసీసీబీ కార్యాలయంలో సీఈవో శంకరన్‌ను కలిసి ఆమె విన్నవించుకున్నారు. 52 కనికాపురం రెవెన్యూలో తమ అత్త కస్తూరి పేరుతో 2.50 ఎకరాల భూమి ఉందన్నారు. ఈ భూమిపై 2011లో బోగస్ పట్టాలు సృష్టించి శ్రీరాంగారాజుపురం ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులో కృష్ణమ్మ పేరుతో తాకట్టు పెట్టేశారని ఆరోపించారు. అదే ఏడాది డిసెంబర్‌లో భూమి పై లోను కావాలని వెళితే.... అక్కడి అధికారులు మాయ మాటలు చెప్పి పంపించేశారని వాపోయారు. మరో బ్యాంకుకు వెళ్లి పరిశీలిస్తే అసలు విషయం బయట పడిందన్నారు. ఆపై స్థానిక బ్యాంకుకి వెళ్లి ప్రశ్నిస్తే డాక్యుమెంట్లు దాచిపెట్టేశారని ఆరోపించారు. దొంగ పత్రాల కారణంగా తమ భూమిపై రుణం తీసుకోలేకపోతున్నామని, ప్రభుత్వ పథకాలు కూడా దొంగ పత్రాలు చేసుకున్న వారికి అందుతున్నాయని పేర్కొన్నారు. కుమారుడు చదువు కోసం రుణం అవసరమని, ఈ నకిలీ వ్యవహారాన్ని కలెక్టర్‌కు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. శాఖాపరంగా విచారించి తప్పుడు భూపత్రాల సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
అత్యధిక కేసులు పరిష్కరించండి
– సీనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర
పుత్తూరు: స్థానిక సబ్‌కోర్టు ఆవరణలో మార్చి 14వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించే విధంగా కృషి చేయా లని న్యాయవాదులకు పుత్తూరు మండల న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, సీనియర్ సివిల్ జడ్జి ఎస్‌సీ.రాఘవేంద్ర సూచించారు. సోమవారం కోర్టు హాలులో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. జడ్జి మాట్లాడుతూ ప్రధానంగా రాజీకి లోబడిన క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్ కేసులను రాజీ చేయాలని సూచించారు. కోర్టులో పెండింగ్‌లో లేని ఫ్రీ లిటిగేషన్ కేసులను సైతం లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. నగదుతో పాటు విలువైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మానసిక ఆందోళనలకు దూరం కావాలంటే రాజీ మార్గమే సురక్షితమైనదని కక్షిదారులకు అవగాహన కల్పించాలని కోరారు. లోక్ అదాలత్‌లో తీర్పు అంతిమ తీర్పని, దానిపై అప్పీలు ఉండదన్నారు.
దారుణం!


