దిక్కులేని డైట్!
ప్రిన్సిపల్ లేకుండా
కళాశాల నిర్వహణ
భావి భారత టీచర్లను తీర్చిదిద్దే కార్వేటినగరం ప్రభుత్వ డైట్ కళాశాలకు దిక్కెవరు అని పలువురు విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని గంగాధరనెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలంలో ఉండే ప్రభుత్వ డైట్ కళాశాలలో గత నెల రోజులుగా రెగ్యులర్ ప్రిన్సిపల్ లేరు. కళాశాల నిర్వహణలో కీలకపాత్ర పోషించే రెగ్యులర్ ప్రిన్సిపల్ ను నియమించడంలో చంద్రబాబు సర్కారు అలసత్వం వహిస్తోంది. ప్రిన్సిపల్ లేకపోవడంతో కళాశాలలో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. కార్వేటినగరం ప్రభుత్వ డైట్ కళాశాల దుస్థితి పై ప్రత్యేక కథనం..
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఏకై న ప్రభుత్వ డైట్ కళాశాల కార్వేటినగరంలో ఉంది. ఈ కళాశాలను 1975లో నిర్మించారు. ఇక్కడ విద్యనభ్యసించిన లక్షల మంది విద్యార్థులు టీచర్లుగా స్థిరపడ్డారు. ఇంత చరిత్ర కలిగిన డైట్ కళాశాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. కీలకమైన రెగ్యులర్ ప్రిన్సిపల్ పోస్టును భర్తీ చేయకుండా నాన్చుతోంది.
అయోమయం
కార్వేటినగరం డైట్ కళాశాలలో ప్రస్తుతం 106 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆ కళాశాలలో ఉండే వసతి గృహంలో సైతం రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు బస చేస్తున్నారు. రెగ్యులర్ ప్రిన్సిపల్ లేకపోవడంతో విద్యార్థులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. లెక్చరర్లకు సమస్యలు విన్నవించుకుంటే ప్రిన్సిపల్ పరిష్కరించాలంటూ చేతులెత్తుస్తున్నారు. ఈ కళాశాలలో గత ఏడాది డిసెంబర్ ఆఖరి వరకు రెగ్యులర్ ప్రిన్సిపల్‌గా వరలక్ష్మి విధులు నిర్వహించారు. ఆమె గత డిసెంబర్‌లో ఉద్యోగ విరమణ పొందారు. వెంటనే రెగ్యులర్ అధికారిని నియమించాల్సిన ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. ప్రిన్సిపల్ పోస్టుకు అర్హత కలిగిన అధికారులు రాష్ట్ర విద్యాశాఖ, సమగ్రశిక్ష కార్యాలయాల్లో పలువురు ఉన్నా పట్టించుకోవడం లేదు.
ఎవరికి వారే యమునాతీరే
డైట్ కళాశాలలో రెగ్యులర్ ప్రిన్సిపల్ లేకపోవడంతో అక్కడ ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. కళాశాలలో దాదాపు 40 మంది లెక్చరర్లు విధులు నిర్వహిస్తున్నారు. వారు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి. అదే విధంగా లెక్చరర్ల జనవరి జీతాలు పెండింగ్ పడ్డాయి. కీలకమైన మొదటి, ద్వితీయ సంవత్సరం టీచింగ్ ప్రాక్టీస్ తరగతులు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రాథమిక స్థాయిలో నిర్వహిస్తున్న జీఎఫ్‌ఎల్ ఎన్ పర్యవేక్షణ ఉండడం లేదు. రాష్ట్ర విద్యాశా ఖ ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించి వెంటనే ప్రభుత్వ డైట్ కళాశాలకు రెగ్యులర్ ప్రిన్సిపల్‌ను నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.


