వినూత్న ఆలోచనలతోనే నూతన సాంకేతికత
నారాయణవనం: వినూత్న ఆలోచనలతోనే ఇంజినీరింగ్ విద్యార్థులు నూతన సాంకేతికతను ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబల్ ఎనర్జీ సీనియర్ డైరెక్టర్, సైంటిస్ట్ గౌరవ్ మిశ్ర పేర్కొన్నారు. సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లి వేడుకల్లో భాగంగా నాలుగోరోజు శనివారం ప్రాజెక్ట్ ఎక్స్ పో, హ్యాకతాన్‌లను ఆయన కళాశాలల చైర్మన్ అశోకరాజుతో కలిసి ప్రారంభించారు. గౌరవ్ మిశ్రా మాట్లాడుతూ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్‌లు వినూత్న ఆలోచనకు దర్పణం పడుతోందని అన్నారు. సమాజానికి దోహదపడేలా ప్రాజెక్ట్‌లను డిజైన్ చేయాలని సూచించారు. ముఖ్యంగా సాంకేతిక, వ్యవసాయ రంగాల చేయూతకు మిషన్ల తయారీపై దృష్టి సారించాలన్నారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రకృతిలో తిరిగి ఉపయోగించే శక్తితో పనిచేసే యంత్రాలను, దైనందిన జీవితంతో ముడిపడే సాధనాలను తయారు చేయాలని చెప్పారు. ప్రదర్శనలో ఎంపిక చేసిన ప్రాజెక్ట్‌లను న్యూ ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబల్ ఎనర్జీ పరిశోధన విభాగం సిఫారసు మేరకు స్టార్టప్ ప్రాజెక్ట్‌ల ప్రారంభానికి నిధులను మంజూరు చేస్తామని గౌరవ్ మిశ్రా ప్రకటించారు. చైర్మన్ అశోకరాజ్ మాట్లాడుతూ 12 బ్రాంచ్‌లకు 200కు పైగా ప్రాజెక్ట్‌లు ప్రదర్శించగా 65 ప్రాజెక్ట్‌లు గుర్తింపు పొందాయన్నారు. నేషనల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ సైంటిస్ట్ ఉషాదీక్షిత్ విద్యార్థి ఫెస్ట్ హ్యాక్‌ను ప్రారంభించారు. 24 గంటల పాటు నిర్వహించే పెస్ట్ హ్యాక్‌లో సాంకేతిక అంశాలపై చర్చించడానికి 85 కళాశాలల నుంచి 1,750 మంది డెలిగేట్స్ హాజరవుతున్నారని అశోకరాజు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురికి రూ.3.50 లక్షల నగదు బహుమతిని అందజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు, కోఆర్డినేటర్లు సరోజు, నాగరాజు, హెచ్‌ఓడీలు తదితరులు పాల్గొన్నారు.


