టీచర్ల హామీలు నెరవేర్చండి
జిల్లా వ్యాప్తంగా ఎస్టీయూ నిరసనలు తహసీల్దార్లకు వినతిపత్రాల అందజేత
చిత్తూరు కలెక్టరేట్ : చంద్రబాబు ప్రభుత్వం టీచర్ల హామీలను నెరవేర్చాలంటూ జిల్లాలోని ఎస్టీయూ సంఘ నాయకులు, టీచర్లు నిరసన చేపట్టారు. జిల్లాలోని అన్ని మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టారు. ఆపై తహసీల్దార్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్టీయూ సంఘ జిల్లా అధ్యక్షుడు మదన్‌మోహన్‌రెడ్డి చంద్రబాబు ప్రభుత్వ తీరు పై మండిపడ్డారు. 12వ పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలన్నారు. గత ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్‌సీ అమలు చేసే వరకు 30 శాతం తగ్గకుండా మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. హామీలు అమలు చేసే వరకు పోరాటాలు ఆగవని ఆయన హెచ్చరించారు. నిరసన కార్యక్రమాల్లో ఎస్టీయూ నాయకులు సుబ్రహ్మణ్యంపిళ్‌లై, గుణశేఖరన్, గణపతి, రంగనాథం, ప్రమీల కుమారి, నీరజ, లోహితానందవల్లి పాల్గొన్నారు.


