ఆద్యంతం హడావుడి.. | - | Sakshi
Sakshi News home page

ఆద్యంతం హడావుడి..

Dec 5 2025 6:44 AM | Updated on Dec 5 2025 6:44 AM

ఆద్యం

ఆద్యంతం హడావుడి..

● పోలీసుల పహారా నడుమ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పర్యటన ● బాధలు చెప్పుకుందామని డీడీఓ కార్యాలయం వద్ద్ద జనం పడిగాపులు ● కారు దిగకుండా వెళ్లిపోయిన ఉపముఖ్యమంత్రి ● ఎప్పుడో కట్టిన భవనానికి రంగులు వేసి ప్రారంభించిన వైనం ● పవన్‌ పర్యటనకు టీడీపీ, బీజేపీ క్యాడర్‌ దూరం

చిత్తూరు కలెక్టరేట్‌ : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చిత్తూరు పర్యటన ఆద్యంతం పోలీసుల పహారా నడుమ.. హడావుడిగా సాగింది. గురువారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు సమీపంలో ఉన్న డీడీఓ (డివిజనల్‌ అభివృద్ధి అధికారి) కార్యాలయం ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విచ్చేశారు. అయితే జిల్లా పర్యటనకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించుకుందామని ఉదయం నుంచి మధ్యాహ్నం 2.15 గంటల వరకు డీడీఓ కార్యాలయం పడిగాపులు కాసిన ప్రజలను కలవకుండా పవన్‌ ముఖం చాటేశారు. అర్జీలు తీసుకోవడానికి ఇష్టపడని పవన్‌.. కారు దిగకుండా వెళ్లిపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక్కడికి వచ్చి వర్చువల్‌లో

ప్రారంభించడమేమిటో..!

కలెక్టరేట్‌కు సమీపంలో ఉన్న డీడీఓ కార్యాలయం ఎప్పుడో నిర్మించారు. ఇదివరకే ఆ భవనంలో గతంలో పలువురు జాయింట్‌ కలెక్టర్లు సైతం పరిపాలన వ్యవహారాలు సాగించారు. గతంలో సచివాలయా ల పర్యవేక్షణ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ కూడా ఇక్క డి నుంచే జరిగేది. ప్రస్తుతం ఆ భవనంలో టూరి జం శాఖతో పాటు పలు కార్యాలయాలు సైతం ఉన్నా యి. అలాంటి భవనానికి ప్రస్తుతం రూ.40 లక్షలు వెచ్చించి తిరిగి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యా ణ్‌ చేతు ల మీదుగా వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించడమేమిటో అని చర్చకు దారి తీసింది. పలు శాఖల అధికారులు కడూఆ ఇది పాత భవనమే కదా .. ఇప్పుడు ప్రారంభించడం ఏమిటంటూ గుసగుసలాడారు.

గ్రామస్థాయిలో 7,244 క్లస్టర్లు రద్దు

గ్రామస్థాయిలో 7,244 క్లస్టర్లను రద్దు చేసి 13,350 గ్రామ పంచాయతీలను స్వయం పాలన సంస్థలుగా మార్చినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. ప్రతి పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీని, 10 వేలు జనాభా దాటిన గ్రామ పంచాయతీలకు ఒక గెజిటెడ్‌ ఆఫీసర్‌ను పంచాయతీ డెవలప్‌మెంట్‌ అధికారిగా నియమించామన్నారు. ప్రస్తుతం ఉన్న 5 గ్రేడ్ల పంచాయతీ సెక్రటరీలను మూడు గ్రేడ్‌లుగా చేస్తూ పంచాయతీ సెక్రటరీ పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్చామన్నారు. పంచాయతీరాజ్‌ సంస్థలను పటిష్టం చేయడానికి ఒక ప్రత్యేక ఐటీ వింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు.

పంచాయతీరాజ్‌ శాఖలోనూ డివిజన్‌ అధికారి

పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణతేజ మాట్లాడుతూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల పాలనాపరమైన సంస్కరణల్లో జీఓఎంఎస్‌ నంబర్‌ 57, 58లను తీసుకురావడం జరిగిందన్నారు. మండల స్థాయిలో అభివృద్ధి శాఖకు ఎంపీడీఓలు, రెవెన్యూ శాఖకు తహసీల్దార్లు, పోలీస్‌ శాఖకు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు ఉంటారని చెప్పారు. వీరికి సంబంధించి రెవెన్యూ, పోలీస్‌ శాఖకు మాత్రమే డివిజినల్‌ కార్యాలయాలు ఉన్నాయని, ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో ఇకపై పంచాయతీరాజ్‌ శాఖకు సైతం ఒక డివిజినల్‌ స్థాయి అధికారి ఉంటారన్నారు. గ్రూప్‌–1 పరీక్షల్లో ఈ పోస్ట్‌లను భర్తీ చేయవచ్చన్నారు. కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ మాట్లాడుతూ పంచాయతీరాజ్‌ శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలతో పాలనాపరంగా రెట్టింపు ఉత్సాహంతో పని చేయడంతో పాటు శాఖ బలోపేతం చేసినట్లు అవుతుందన్నారు. జిల్లాలో 4 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయని, ఈ కార్యాలయాలను జీప్లస్‌ వన్‌ తరహాలో జెడ్పీ నిధుల నుంచి కార్యాలయ భవనాలు, మౌలిక వసతుల ఏర్పాటు చేస్తామన్నారు. ఎంపీడీఓలు, డీడీఓల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్‌మోహన్‌, మురళీమోహన్‌, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగర మేయర్‌ అముద, చుడా చైర్మన్‌ కఠారి హేమలత, డీడీఓ రవికుమార్‌ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మదనపల్లె మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ను లోపలకు వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు

డిప్యూటీ సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు గంటల తరబడి నిరీక్షిస్తున్న అర్జీదారుడు

టీడీపీ, బీజేపీ కేడర్‌ దూరం

డిప్యూటీ సీఎం పవన్‌ పర్యటనలో ప్రజల కంటే పోలీసులే ఎక్కువగా కనిపించారు. డీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యాలయం వద్ద మూ డంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరినీ లోప లకు వెళ్లనివ్వకుండా పోలీసులు పహారా కాశారు. డిప్యూటీ సీఎం పర్యటనకు హాజరయ్యేందుకు విచ్చేసిన పలువురు ప్రజాప్రతినిధులను సైతం పోలీసులు నిలిపివేశారు. మదనపల్లె మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ జంగళ శివరామ్‌కు సైతం అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు డిప్యూ టీ సీఎం పర్యటనకు టీడీపీ, బీజేపీ కేడర్‌ దూరమయ్యారు. ఈ విషయం ఆయా పార్టీల్లోనే తీవ్ర చర్చకు దారి తీసింది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌ తప్ప మిగిలిన గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే థామస్‌, నగరి గాలి భానుప్రకాష్‌, పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్‌ ఎవరూ కనిపించలేదు. కొద్దిమంది జనసేన నాయకులు మాత్రం కాస్త హడావుడి చేశారు.

ఆద్యంతం హడావుడి..1
1/1

ఆద్యంతం హడావుడి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement