బాబోయ్‌ పురుగు! | - | Sakshi
Sakshi News home page

బాబోయ్‌ పురుగు!

Dec 4 2025 8:35 AM | Updated on Dec 4 2025 8:35 AM

బాబోయ్‌ పురుగు!

బాబోయ్‌ పురుగు!

వణికిస్తున్న ‘టైఫస్‌’

జిల్లాలో వైరల్‌కు తోడు స్క్రబ్‌ టైపస్‌ కేసులు

జనంపై దాడి చేస్తున్న టైఫస్‌ కీటకం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం నిల్‌

ప్రైవేటు బాటపడుతున్న బాధితులు

పట్టించుకోని ప్రభుత్వం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ వణికిస్తోంది. వ్యాధి విస్తరిస్తూ..జనాన్ని భయపెడుతోంది. కీటకం జనంపై దాడి చేసి ఆస్పత్రి పాలుచేస్తోంది. జ్వరం తీవ్రత అధికం కావడంతో స్క్రబ్‌ టైఫస్‌గా వెలుగు చూస్తోంది. టైఫస్‌ చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులే దిక్కుగా మారుతున్నాయి. ఆ ఆస్పత్రిల్లో లక్షల్లో ఫీజులు చెల్లించలేక జనం ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో టైఫస్‌కు వైద్యం లేక విలవిల్లాడుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.

గుబులు పుట్టిస్తున్న కేసులు

జిల్లాను స్క్రబ్‌ టైఫస్‌ వణికిస్తోంది. చిత్తూరు పరిసర ప్రాంతాల్లోని మండలాలో నమోదవుతున్న కేసులు గుబులు పుట్టిస్తున్నాయి. చిత్తూరు నుంచి బంగారుపాళ్యం మండలం వెంకటాపురం గ్రామానికి వెళ్లిన ఓ మహిళను రెండు రోజుల క్రితం టైఫస్‌ కీటకం కుట్టింది. గంటల్లోనే ఆ ఎఫెక్ట్‌ తీవ్రతరం కావడంతో బంధువులు ఆమెను చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ రెండు రోజుల పాటు చికిత్స తీసుకుంటూ...మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్‌కు తీసుకెళ్లారు. అలాగే గుడిపాలకు చెందిన వ్యక్తి కూడా చికిత్స కొనసాగుతోంది. జ్వరం పట్టి పీడిస్తోంది. ఇక కొత్తగా ఐరాల మండలం బొమ్మసముద్రం గ్రామంలోని ఒకరికి స్క్రబ్‌ టైఫస్‌గా నిర్ధారణ అయింది. దీంతో జనం హడలిపోతున్నారు.

నిద్ర వీడని వైద్యాధికారులు

స్క్రబ్‌ టైఫస్‌ జిల్లాను అతలాకుతలం చేస్తోంది. రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధిక కేసులుగా రికార్డుకెక్కింది. అయినా జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో చలనం లేదు. టైఫస్‌ నివారణకు కనీస చర్యలు చేపట్టడం లేదు. ప్రజలకు అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు దృష్ట్యా ఈ టైఫస్‌ మరింత విజృంభించే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్క్రబ్‌ టైఫస్‌కు వైద్యం పూర్తిగా కరువుతోంది. వైద్యాధికారులు చూసీ చూడనట్లు వదిలేయడంతో కేసుల తీవ్రత రెట్టింపవుతోంది. ఈ వ్యాధి నిర్ధారణకు స్క్రబ్‌ టైఫస్‌ ఐజీఎమ్‌ అనే టెస్ట్‌ చేయాలి. కానీ ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ జిల్లాలో లేకపోవడంతో ఆ టెస్టు దూరమవుతోంది. ఎలిసా ద్వారా కూడా ఈ టైఫస్‌ను గుర్తించవచ్చు. కానీ ఎలిసా ఒక్క టెస్టుకు గాను రూ. 2 వేలు వ్యయమవుతోంది. ఈ వ్యయ భారంతో ప్రభుత్వం కూడా టైఫస్‌ టెస్టు చేసేందుకు వెనకడుగు వేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రైవేటు దోపిడీ

స్క్రబ్‌ టైఫస్‌ బారిన పడిన వారికి ప్రస్తుతం ప్రైవేటు ఆస్ప్రత్రుల్లో మాత్రమే చికిత్స అందుతోంది. అధిక జ్వరమని వెళితే.. తొలుత అక్కడ ఎలిసా టెస్టు చేస్తున్నారు. ఇందుకు రూ.2 వేలు ఫీజు తీసుకుంటున్నారు. తర్వాత చికిత్స కోసం రూ. 500 వరకు ఫీజు ఇచ్చుకోమంటున్నారు. అడ్మిట్‌ అయితే రూ. లక్షల్లో ఫీజులు చెల్లించుకోవాల్సి వస్తోందని బాధిత కుటుంబీకులు వాపోతున్నారు. తిరుపతి, బెంగుళూరుకు, తమిళనాడులోని వేలూరు, రాణిపేట, చైన్నె ఆస్పత్రుల్లో లక్షలు పోసి ఊపిరి పోసుకుంటున్నారు. అయితే జిల్లాలో ఈ స్క్రబ్‌ టైఫస్‌కు ఎలాంటి వైద్యం లేకపోవడంతో ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.

రాష్ట్ర అధికారుల ఆరా

జిల్లాలో నమోదవుతున్న స్క్రబ్‌ టైఫస్‌ కేసులపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆరా తీశారు. జూమ్‌ ద్వారా రాష్ట్ర అధికారులు... జిల్లా అధికారులతో గంటపాటు చర్చించారు. స్క్రబ్‌ టైఫస్‌ కేసుల వ్యాప్తికి గల కారణాలపై అడిగి తెలుసుకున్నారు. అవగాహన కల్పించాలని ఆదేశించారు. కేసులు నమోదవుతున్నా ఎందుకు నిర్లక్ష్యమంటూ జిల్లావైద్య ఆరోగ్యశాఖ అధికారులకు రాష్ట్ర అధికారులు హెచ్చరించినట్లు తెలిసింది.

జనం కలవరపాటు

వైద్య ఆరోగ్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం వారం రోజులుగా జిల్లాలో 2,500 ఫీవర్‌ కేసులు నమోదయ్యాయి. అనాధికారికంగా 3 వేలకుపైగా కేసులుంటాయి. దీనికి స్క్రబ్‌ టైఫస్‌ కేసులు సైతం తోడయ్యాయి. ఇవీ ఏడాదిగా 155 కేసులు నమోదైనట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. స్క్రబ్‌ టైఫస్‌కు ఇక్కడ వైద్యం అందక కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని ఆస్పత్రులకు వెళ్లిన వారు 160 మందికిపైగా ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇవన్నీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల లెక్కల్లోకి రావడం లేదని తెలుస్తోంది. కేవలం జిల్లాలో చికిత్స తీసుకుంటున్న వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎంత లెక్క తగ్గితే అంత మేలని...అధికారులు కేసుల సంఖ్యను తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా గతం వారం రోజుల్లో జిల్లాలో 10 కేసులు నమోదు కావడంతో కలవర పాటుకు గురిచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement