విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించాలి
చిత్తూరు కలెక్టరేట్ : విభిన్న ప్రతిభావంతులతోనే మార్పు మొదలవ్వాలని ఎస్పీ తుషార్ డూడీ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీసీ భవన్‌లో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులకు తగిన అవకాశాలు ఇస్తే ఏ రంగంలోనైనా రాణించి అద్భుతాలు సృష్టిస్తారన్నారు. సమాజం విభిన్నప్రతిభావంతులకు ఇవ్వాల్సింది జాలి, కరుణ కాదని సమాన అవకాశాలని తెలిపారు. దివ్యాంగుల హక్కులు, సంక్షేమ పథకాల పై అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాజం మొత్తం విభిన్నప్రతిభావంతులను అర్థం చేసుకొని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విభిన్న ప్రతిభావంతులకు ఎవరైనా అన్యాయం చేసినా, వేధింపులు, హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినా వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు. అనంతరం వివిధ క్రీడలలో గెలుపొందిన విభిన్న ప్రతిభావంతులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మేయర్ అముద, చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విక్రమ్‌కుమార్‌రెడ్డి, డీఎస్పీ సాయినాథ్ పాల్గొన్నారు.


