రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : రోడ్డు దాటే సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అయ్యప్ప మాలధారుడు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చిత్తూరు మండలం చెర్లోపల్లి వద్ద చోటుచేసుకుంది. వివరాలు ఇలా...వైఎస్సార్ కడప జిల్లా కమ్మపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు(50) శబరిమలకు వెళ్లి వస్తుండగా మార్గ మధ్యలో చెర్లోపల్లి వద్ద భోజనం కోసం కారు ఆపారు. మాలదారుడు సర్వీసు రోడ్డు దాటే క్రమంలో గుర్తు తెలియని కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో సంఘటన స్థలంలోనే శ్రీనివాసులు మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రూ. 30 లక్షల పొదుపు సొమ్ము స్వాహా
పుంగనూరు : మండలంలోని మంగళం పంచాయతీ జెట్టిగుండ్లపల్లెకి చెందిన శివశక్తి పొదుపు సంఘం సభ్యులు బుధవారం పట్టణంలోని సీ్త్ర శక్తి కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వివరాలిలా ఉన్నాయి. పంచాయతీకి చెందిన సంఘమిత్ర మహిళలు పొదుపు చేసిన సుమారు రూ.30 లక్షల రూపాయలను ఖాతాల్లో జమ చేయకుండా స్వాహా చేశారని మహిళలు ఆరోపిస్తూ నినాదాలు చేశారు. గత నెల 13న జరిగిన సమావేశంలో ఏపీఎం కృష్ణప్ప సమక్షంలో 15 మంది మహిళలకు చెందిన డబ్బులు వాడుకున్నట్లు సంఘమిత్ర అంగీకరించారని, కానీ నెల రోజులు గడుస్తున్నా చెల్లించకపోవడంతో సంఘ మహిళలు అప్పులు తీర్చలేక , వడ్డీలు చెల్లించలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకుని సంఘమిత్ర స్వాహా చేసిన రూ.30 లక్షలు వసూలు చేయించాలని డిమాండ్ చేశారు.
కాపర్ తీగలు చోరీ
వెదురుకుప్పం : మండలంలోని సీఆర్ కండ్రిగ కాలనీకి చెందిన రమేష్ పొలంలో అమర్చిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు బాధితుడు బుధవారం విలేకరులకు తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను పగులగొట్టి అందులోని కాపర్ వైరును అపహరించుకుపోయినట్లు రైతు చెప్పారు.


