మామిడి రైతులకిచ్చిన హామీ ఏమైంది బాబుగారూ!
తిరుపతి అర్బన్: సీఎం చంద్రబాబు మామిడి రైతులకిచ్చిన హామీ ఏమైందో స్పష్టం చేయాలని తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి నిలదీశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మామిడి రైతులు గిట్టుబాటు ధరలు లేక నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో చిత్తూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు కిలో మామిడికి రూ.8 చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే హామీ ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్నా, మామిడి రైతులకు నగదు జమ కాకపోవడం ఏమిటన్నారు. ఇప్పటివరకు జ్యూస్ ఫ్యాక్టరీల నుంచి రైతులకు అందాల్సిన నగదు రాకపోవడంతో వారంతా ఫ్యాక్టరీల చుట్టు తిరగాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్‌లో రైతులు పడుతున్న కష్టాలను అన్నీఇన్నీకాదన్నారు. మామిడి రైతులకు న్యాయం చేయాలంటూ వారి పక్షాన నిలబడిన 30 మందిపై కేసులు పెట్టడానికి మనస్సు ఎలా వచ్చిందో చంద్రబాబు గుర్తు చేసుకోవాలన్నారు. కిలోకు రూ.12 ఇస్తామని, అందులో ఫ్యాక్టరీల నుంచి రూ.8 చొప్పున, ప్రభుత్వం నుంచి రూ.4 చొప్పున ఇస్తామని చెప్పారు. అయితే ఫ్యాక్టరీలు అందులో పెద్ద ఎత్తున కోతలు విధించాయన్నారు. కోతలు విధించినా మిగిలిన సొమ్ము ఇవ్వకపోవడంతో మామిడి రైతులు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. వందల ఎకరాల్లో మామిడి రైతులు పంటను వదిలిపెట్టారని, మరికొందరు ధరలు లేకపోవడంతో పొలంలోనే మామిడి కాయలను వదులుకున్నారని, ఇంకొందరు పెద్ద ఎత్తున మామిడి తోటలను తొలగించారన్నారు. తమ పాలనలో రైతే రాజు అంటూ ప్రసంగాలు చేస్తున్న చంద్రబాబు ఈ అంశాలను గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతుల దుస్థితిని తెలుసుకోవాలని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న అక్కసును రైతులు నిరసన రూపంలో వెళ్లగక్కారని, దాంతోనే రోడ్డెక్కారని గుర్తుచేశారు. మామిడి రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం వెంటనే అందించాలని ఆయన డిమాండ్ చేశారు.


