
కాసుల వైద్యం
ప్రైవేటు ఆసుపత్రుల్లో బాదుడే బాదుడు
జిల్లాలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు ఆస్పత్రులు
అనధికారిక ఆస్పత్రులు కోకొల్లలు
డిమాండ్‌ను బట్టే కన్సల్టెన్సీ
జ్వరమని వెళ్లినా పరీక్షే..
ఫీజు రూ.500 నుంచి.. ఆపైమాటే
ఐసీయూకు రూ.10 వేలు
భయపడుతున్న ప్రజానీకం
కాణిపాకం : జిల్లాలో 1200పైగా ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. రిజిస్ట్రేషన్ కానీ ఆస్పత్రులు మరో 1000 దాకా ఉన్నాయి. అలాగే ల్యాబ్‌లు 900 ఉండగా..అనాధికారికంగా 7000పైగా నడుస్తున్నాయి. ప్రధానంగా పలు ఆస్పత్రుల్లో చూస్తే వెయ్యి..పట్టుకుంటే 5 వేలు అనేంతగా వైద్యుల తీరు మారింది. వైద్యుల వద్దకు వెళ్లి చూపించుకోవాలంటే కన్సల్టెన్సీ ధర తక్కువలో తక్కువంటే రూ.500 నుంచి ఆరంభం. రూ.2 వేలు ఉండే ఆ ధరలు ఉన్నాయి. మందులు మా త్రం నెలకు రాసేస్తారు. అంటే నెల తర్వాత వస్తే మళ్లీ డబ్బులు సమర్పించుకోవాలి. అసలు నాడి పట్టుకోకుండా రోగి లోనికి వచ్చిన సమస్య ఏమిటని అడగడం మరుక్షణం నుంచే మందులు రాసేస్తారు.ఈ కన్సల్టెన్సీ ఫీజులపై నియం త్రణ లేకపోవడంతో రోగిని పిండేస్తున్నారు. ప్రస్తుత తరం వైద్యులను చూసి ఆ తరం వైద్యు లు మారిపోయారు. డబ్బే పరమావధిగా వైద్యం చేస్తున్నారు. దీంతో రోగులు.. వారి కూడా వచ్చే బంధువులు లబోదిబోమంటున్నారు.
ఇష్టారాజ్యంగా వైద్య సేవలు
చాలా వరకు రిజిస్ట్రేషన్ ఉన్న ఆస్పత్రులు ఫీజులు, వైద్యం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కొన్ని ఆస్పత్రులను మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇక రిజిస్ట్రేషన్ లేని ఆస్పత్రులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎలాంటి అనుమతి లేకుండా వైద్యంతో పాటు ఆఫరేషన్లు, ప్రసవాలు చూస్తున్నాయి. ఆ అనుమతి లేని ఆస్పత్రుల్లో చాలా మంది వైద్యర్హాత లేని సిబ్బంది పనిచేస్తున్నారు. కొందరు మెడికల్ షాపుల్లోనే ప్రైవేటు క్లినిక్‌లు, ఆస్పత్రులను ఏర్పాటు చేసుకుని దర్జాగా చికిత్సలు చేస్తున్నారు. కాసులు సముపార్జనే ధ్యేయంగా జరుగుతున్న ఈ దందాకు వైద్య ఆరోగ్య శాఖలోని కొందరు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
అనుమతిలేని ఆస్పత్రులు
చిత్తూరు నగరంలోని సుందరయ్యవీధిలోనే పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్ లేని ఆస్పత్రులు ఏళ్ల తరబడి నిర్వహిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అలాగే మిట్టూరు, కొంగారెడ్డిపల్లి, కట్టమంచి, చర్చివీధి తదితర ప్రాంతాల్లో కూడా ఈ రిజిస్ట్రేషన్‌లేని ఆస్పత్రులు దర్శనమిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటన నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మేల్కోవాల్సిన అవసరం ఉంది.
కమీషన్ల వ్యాపారం
వైద్యో నారాయణో హరి అన్నది ఒకప్పటి నానుడి.. ఎందుకంటే అప్పటిలో వైద్యుడు దేవుడిలా ఉండేవాడు.. వైద్యమూ అలాగే చేసేవారు.. నాడి పట్టుకుని రోగం ఏంటో చెప్పేవారు.. రోగిని చూసి వైద్యం చేసేవారు.. మరిప్పుడు అంతా మారిపోయింది.. రోగి చెప్పింది వినాలంటే (కన్సల్టెన్సీ) రూ.500 నుంచి రూ.1000.. మరీ డిమాండ్ ఉంటే రూ.2 వేలు.. ఒకసారి చేయి పట్టుకుంటే (ఐసీయూ) రూ.10 వేలు..ఆ తరువాత టెస్ట్‌లు.. మందులు షరా మామూలే.. రోగి నుంచి ఇష్టానుసారం పిండేస్తున్నారు.. ఎమర్జెన్సీ ఆసుపత్రుల్లో అయితే మరీనూ.. లక్షలు ఉంటేనే వైద్యం.. లేదంటే దైన్యమే.. ప్రైవేటు వైద్యంపై ప్రభుత్వ నియంత్రణ కొరవడడంతో రోగులను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇక అనుమతులు లేని ఆస్పత్రులు రెచ్చిపోతున్నాయి.
ఆసుపత్రి కెళ్తే జేబు ఖాళీ..
ఇవాళ వైద్య రంగంలో కాసుల కక్కుర్తి తప్ప మానవతా దృక్పథం, నైతిక విలువలు కొరవడడంపై సర్వత్రా విమర్శలు విపిస్తున్నాయి. రోగి వ్యాధిని డబ్బుతో తూకం వేయడం మితి మీరిపోయింది. డాక్టర్లు టార్గెట్లు రీచ్ కావడానికి అవసరం లేకపోయినా ఎక్స్‌రే, స్కానింగ్, మందులు రాసేస్తున్నారు. ఆస్పత్రులకు పట్టుకొన్న మరో జాడ్యం మందులు (మెడిసిన్). సొంతగా ఆస్ప త్రుల్లోనే మెడికల్ షాపులు ఉండడంతో ప్రిస్క్రిప్షన్‌న్ నిండిపోయే వరకూ మందులు రాసేస్తున్నారు. దీని వెనుక ఆశ్చర్యపోయే మాయ దాగి ఉంది. గతంలో మందుల తయారీ కంపెనీలు రిప్రజెంటెటివ్స్‌ని నియమించుకొని వాళ్లను డాక్టరు వద్దకు పంపించి ప్రొడక్టును ప్రచారం చేసుకోవడం జరిగేది. దీనిని ఎథికల్ మార్కెటింగ్ అనే వాళ్లు. ఆ ప్రొడక్టును ఎక్కువగా రాసినందుకు తాయిలాలుగా వచ్చేవి. ఈ పద్ధతి ఇప్పటికీ ఉన్నా బాగా తగ్గింది. ఇప్పుడు కొత్త ఒరవడి వచ్చింది. బెంగుళూరు, చైన్నెలతో పాటు పలు చోట్ల మందుల తయారీ కంపెనీలు కోకొల్లలుగా ఉంటాయి. ఆయా కంపెనీల నుంచి పెద్ద ఎత్తున మందులు తెచ్చి విక్రయిస్తున్నారు. ఇవి వైద్యులకు చాలా తక్కువ ధరకు వస్తాయి. వీటిని ఎక్కువ ధరకు విక్రయిస్తారు.అందుకే అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ మందులు రాస్తుంటారు. గ్యాస్ట్రిక్ లేకపోయినా గ్యాస్ ట్యాబ్లెట్ రాసేయడం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. వైరల్ ఫీవర్‌కు యాంటి బయోటిక్ రాయకూడదు.అసలు యాంటి బయోటిక్స్ తక్కువగా సూచించాలని ఆ తరం వైద్య నిపుణులు నెత్తీ నోరు బాదుకుంటున్నారు. అయినా తమ మెడికల్ షాపుల వ్యాపారం కోసం వైరల్ ఫీవర్‌కు యాంటి బయోటిక్స్‌తో చీటీలో నింపేస్తున్నారు. కాసుల కక్కుర్తితో రాసే మందులు వ్యాధి నయం మాట అటుంచితే కొత్త రోగా లు చుట్టు ముడుతున్నాయి. చివరికి రోగి ఒళ్లు, ఇల్లు గుల్లవుతోంది.
చర్యలు తీసుకుంటాం.
జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల విషయంపై నిఘా పెట్టాం. ఇదివరకే రిజిస్ట్రేషన్ ఉన్న ఆస్పత్రులతో పాటు రిజిస్ట్రేషన్ లేని ఆస్పత్రి వివరాలను సేకరించాలని ఆదేశించాం. ఆ బాధ్యత డెమో సెక్షన్ వాళ్లు చూస్తున్నారు. చిత్తూరు నగరంలో ఎక్కడెక్కడ అనుమతులు లేని ఆస్పత్రులు ఉన్నాయో చూస్తాం. అధిక ఫీజు వసూళ్లు చేసే ఆస్పత్రులపై కొరడా ఝలిపిస్తాం. అలా జరిగితే ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.
– సుధారాణి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, చిత్తూరు
అధిక శాతం ఆస్పత్రులు కమీషన్లతో లాభాలు గడిస్తున్నాయి. ఆర్‌ఎంపీ, పీఎంపీ ఆయా ఆస్పత్రుల్లో ఎన్‌రోల్ చేయించుకొని పేషెంటును రిఫర్ చేస్తే కొంత మొత్తం లేదా 40 శాతం వరకూ కమీషన్ ముట్టజెబుతున్నారు. అందుకే ఈ మధ్య నగరాల్లోని ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో గ్రామీణ రోగులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక స్కానింగ్, ఎక్స్‌రే తదితర టెస్టులకు తమ వద్దకు పంపిస్తే లేబోరేటరీలు ఆయా ఆస్పత్రులకు 50 శాతం వరకూ కమీషనన్ రూపంలో ఇస్తున్నాయి. ఫలానా ల్యాబ్‌కు మాత్రమే వెళ్లాలని ఆస్పత్రుల్లో సూచించడం, వేరే దగ్గర చేయించుకొంటే తిరస్కరించడం, స్పష్టంగా ఫలితాలు రాలేదని చెప్పడం దాదాపుగా అందరికీ అనుభవమే. దీనికి ఆ కమీషన్ల కక్కుర్తే కారణం. ఓ వ్యక్తి లిపిడ్ ప్రొఫైల్ పరీక్షకు ఓ ల్యాబ్‌కి వెళ్లారు. రూ.1200 అవు తుందని వాళ్లు చెప్పారు. ఆ వ్యక్తి డాక్టరు ఫోన్‌్ చేసి వారికి ఇచ్చారు. తాను వేరే ఊరి డాక్టరునని, తనకు కమీషనన్ వద్దని చెప్పడంతో రూ.600 మాత్రమే ల్యాబ్ వారు బిల్లు వేశారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ‘వైద్యో నారాయణో హరి’ అనే నానుడు ఎందుకు కన్నీరు పెడుతోందో చెప్ప డానికి ఈ ఉదాహరణలు మచ్చు తునకలు మాత్రమే సుమా!.. రోజూ ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతూనే ఉన్నాయి.

కాసుల వైద్యం