చిత్తూరు రూరల్(కాణిపాకం): క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (సీడీపీ) కింద ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందింస్తున్నామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నేషనల్ హార్టికల్చర్ మిషన్ సహకారం అందిస్తోందని ఉద్యానశాఖ సీడీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ విద్యాశంకర్ పేర్కొన్నారు. చిత్తూరులోని జిల్లా ఉద్యానశాఖ కార్యాలయంలో శుక్రవారం ఉద్యాన పంటల క్లస్టర్ల అభివృద్ధి కార్యక్రమంపై ఉమ్మడి జిల్లాల ఉద్యానశాఖ అధికారులు, రైతులతో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే పలు పంటలను సీడీపీ పథకం అమలుకు ప్రాథమికంగా అనుమతులిచ్చామన్నారు. 20 శాతం వాటా భరిస్తే...20 శాతం బ్యాంకు రుణం, 20 శాతం సభ్యులైన రైతుల వాటా, మిగిలిన 40 శాతం కేంద్ర ప్రభుత్వ గ్రాంటు రూపంలో అందిస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలో దానిమ్మ, అరటి, టమాట, మిరప తదితర పంటలకు సీడీపీ కింద తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. విత్తనం, మొక్కలు, ఎగుమతులు, కల్టివేషన్, పోస్ట్ హార్వెస్టింగ్, బ్రాండింగ్, లాజిస్టిక్స్ అంశాలపై ఏదైన ఒక పంటను ఎంపిక చేసుకున్న సంస్థ తమ దగ్గరున్న వనరులు, మౌలిక సదుపాయాలతో కూడిన ప్రాజెక్టు రిపోర్టు అందిస్తే అనుమతులు జారీ చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హాజరైన అధికారులు, రైతులు
మాట్లాడుతున్న రాష్ట్ర కో–ఆర్డినేటర్
ఉద్యాన పంటల అభివృద్ధే లక్ష్యం