
ఇంకా కనిపించని యువకుడి జాడ
పలమనేరు: మండలంలోని కళ్యాణి వాటర్ పాల్స్ ప్రవాహంలో గురువారం గల్లంతైన యువకుడి ఆచూకీ ఇంకా లభించలేదు. అగ్నిమాపక సిబ్బంది రెండో రోజు శుక్రవారం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. పలమనేరు పట్టణానికి చెందిన ఫయాజ్ పెద్ద కుమారుడు యూసఫ్(25) చికెన్ షాపులో పనిచేస్తున్నాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కళ్యాణి వాటర్‌పాల్స్ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీన్ని చూసేందుకు పదిమంది స్నేహితులతో కలిసి గురువారం మధ్యాహ్నం అక్కడికి వెళ్లారు. యూసఫ్ నీటిలో దూకాడు. పైనున్న స్నేహితులు సెల్‌ఫోన్‌లో రికార్డు చేస్తున్నారు. యూసఫ్ నిమిషం వ్యవధిలోనే కనిపించకుండాపోయాడు. స్నేహితులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని వెతికినా కనిపించలేదు. గురువారం చీకటి పడడంతో శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టారు. వాటర్‌పాల్స్ కొండల నుడుమ ఉండడం, నీరు ఇక్కడి నుంచి తమిళనాడులోని మోర్ధానా ప్రాజెక్టుకు నీరు చేరుతుండడంతో మృతదేహం ఎక్కడైనా రాళ్లకు, చెట్లకు చిక్కుకుని వుండే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.