
పరిసరాల శుభ్రత పై అవగాహన
ఎంపీడీవోలు, కమిషనర్‌లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి మూడో విడత రీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి వరుస సమావేశాల్లో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడి
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు పారిశుద్ధ్యంపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి సమస్యలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎంపీడీవోలు పంచాయతీ సెక్రటరీలపై ఆధారపడకుండా క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో కురిసే వర్షాలకు ప్రబలే సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
పకడ్బందీగా రీ సర్వే
జిల్లా వ్యాప్తంగా 3వ విడత రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ, సర్వేశాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ సమస్యలను పరిష్కరించడంలో మండల సర్వేయర్, వీఆర్‌వోలు ముఖ్యపాత్ర పోషించాలన్నారు. రీ సర్వేలో అందే అర్జీలకు పది రోజుల్లోపు పరిష్కారం చూపాలన్నారు. జేసీ విద్యాధరి మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో 31 గ్రామాల్లో 30,774 ఎకరాల భూమిని రీ సర్వే చేశారన్నారు. రెండో విడతలో 38 గ్రామాల్లో 40,359 ఎకరాల్లో, మూడో విడతలో 12 గ్రామాల్లో 3,859 ఎకరాల భూమిని రీసర్వే చేస్తున్నట్లు తెలిపారు. ఈ రీ సర్వే వచ్చే ఏడాది మార్చి 31 వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రేపటి నుంచి జిల్లాలోని 12 గ్రామాల్లో మూడో విడత రీ సర్వే చేపట్టనున్నట్టు తెలిపారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడేల్, డీఆర్‌వో మోహన్‌కుమార్, సర్వే శాఖ డీడీ జయరాజ్, ఏడీ శాంతిరాజ్, తహసీల్దార్లు, సర్వేయర్‌లు, వీఆర్‌వోలు పాల్గొన్నారు.