
అభ్యుదయ రైతుకు అభినందన
పెనుమూరు(కార్వేటినగరం) : ప్రముఖ కవి, అభ్యుదయ రైతు హరికృష్ణారెడ్డిని కలెక్టర్ సుమిత్‌కుమార్ అభినందించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జీఎస్టీ తగ్గింపుపై జరిగిన అవగాహన కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యంత్రాలు, పరికరాల ప్రదర్శన జరిగింది. హరికృష్ణారెడ్డి పులిగుంటేశ్వర ప్రకృతి రైతు ఉత్పత్తిదారుల సంఘం స్థాపించి రైతులకు పవర్ స్ప్రేయర్లు, డ్రోన్లు అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా అభ్యుదయ రైతు హరికృష్ణారెడ్డి కొనుగోలు చేసిన కిసాన్ డ్రోన్‌ను ప్రారంభించి రైతును కలెక్టర్ అభినందించారు. వారితో పాటు పూతలపట్టు ఎమ్మెల్యే, చిత్తూరు ఎమ్మెల్యే కూడా అభినందించారు.
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో బుదవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 14 కంపార్ట్‌మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 73,275 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,973 మంది తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.77 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.