స్విమ్స్‌లో మెడికల్‌ మాఫియా! | - | Sakshi
Sakshi News home page

స్విమ్స్‌లో మెడికల్‌ మాఫియా!

Oct 2 2025 8:25 AM | Updated on Oct 2 2025 8:25 AM

స్విమ

స్విమ్స్‌లో మెడికల్‌ మాఫియా!

పద్మావతి ఆస్పత్రి మందులషాపు కేటాయింపులో కిరికిరి టీటీడీకీ రూ.57లక్షలు ఎగ్గొట్టిన వ్యక్తికి కట్టబెట్టేందుకు ఎత్తులు ఒత్తిడికి తలొగ్గి డిపాల్టర్‌కు అనుకూలంగా టీటీడీ చైర్మన్‌ ఆదేశాలు?

సాక్షి టాస్క్‌ ఫోర్స్‌: టీటీడీ పరిధిలోని స్విమ్స్‌ ఆస్పత్రిలో మెడికల్‌ మాఫియా రాజ్యమేలుతోంది. ఇప్పటికే ఇక్కడి మందుల షాపులో నాణ్యమైన మందులు లేవని, జనరిక్‌ స్థానంలో ఖరీదైన మందులను రోగులకు అంటగడుతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. వీటి ఆధారంగానే ఇటీవల సదరు మందుల దుకాణం నిర్వహిస్తున్న ఇన్నొవేటివ్‌లీ ఫార్మాస్యూటికల్‌ కంపెనీకి టీటీడీ నోటీసులు కూడా జారీ చేసింది. అయినప్పటికీ కంపెనీ యజమాని తన రాజకీయ పలుకుబడితో నోటీసులను లెక్కచేయలేదు. టెండర్‌ రూల్స్‌కు విరుద్ధంగా మందులు విక్రయిస్తున్నా అడిగేవారు కరువయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడి అండదండలతో కంపెనీ యజమాని రెచ్చిపోతున్నాడు. సిమ్స్‌ ఓపీ , డాక్టర్స్‌ క్యాంటీన్‌ పక్కన గతంలో ఉన్న జనరిక్‌ మందుల షాపులు రోగులకు సౌకర్యంగా ఉండేవి. అత్యవసర విభాగం సమీపంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి కుడి పక్కన ఉన్న ఇన్నొవేటివ్‌లీ ఫార్మా కంపెనీకి చెందిన మెడికల్‌ షాప్‌ మేలు కోసం ఆ రెండు జెనరిక్‌ షాపులను తొలగించారు. ఈ మందుల దుకాణం నిర్వహణ తీరు స్విమ్స్‌ అధికారులకు సైతం తలనొప్పిగా మారింది. ఇది చాలదన్నట్టు పద్మావతి ఆస్పత్రి సమీపంలోని మరో మెడికల్‌ షాపును సైతం ఇన్నొవేటివ్‌లీ ఫార్మా యజమాని దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. రాజకీయ నేతలను రంగంలోకి దింపి టీటీడీ చైర్మన్‌ను సైతం మెప్పించి, ఒప్పించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సదరు మెడికల్‌ ఏజెన్సీకి టెండర్‌ ఫైనల్‌ చేయాలని టీటీడీకి అనధికారిక ఆదేశాలు అందినట్లు సమాచారం.

డిపాల్టర్‌గా

ముద్ర

స్విమ్స్‌ అత్యవసర విభాగం సమీపంలోని మెడికల్‌ షాపును ఈ ఏడాది జనవరి నుంచి ఇన్నొవేటివ్‌లీ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ చేజిక్కించుకుని పలు ఆరోపణల నడుమ నడుపుతోంది. స్విమ్స్‌ పరిధిలో కొంత కాలం వరకు మరో మెడికల్‌ షాపు లేకుండా చక్రం తిప్పి పుష్కలంగా ఆదాయం పొందుతోంది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలకు అడిగింది ఇచ్చుకుని పద్మావతి ఆస్పత్రిలోని పద్మావతి మెడికల్‌ షాపును కూడా దక్కించుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మందుల దుకాణానికి రెండు నెలల క్రితం టీటీడీ టెండర్‌ పిలిచింది. నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవాళ్లు కేవలం ముగ్గురు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 25వ తేదీన టెండర్‌ ఓపెన్‌ చేశారు. సదరు ఫార్మా కంపెనీ అత్యధిక కోడ్‌ తో మొదటి వరుసలో నిలిచి టెక్నికల్‌గా అర్హతను కోల్పోయింది. టీటీడీలో ఇప్పటివరకు నిధులను ఎగ్గొట్టిన వారు టెండర్‌ తగ్గించుకునేందుకు అనర్హులు. ఇప్పటికే నడుపుతున్న మెడికల్‌ షాపునకు సంబంధించి టీటీడీకి రూ. 57 లక్షలకు పైగా సకాలంలో చెల్లించకుండా ఇన్నొవేటివ్‌లీ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ ఎగ్గొట్టింది. అలాగే టీటీడీకి ఇవ్వాల్సిన రూ.5కోట్ల బ్యాంకు గ్యారంటీని పాత మెడికల్‌ షాపునకు సంబంధించిన గ్యారెంటీనే కొత్త అటెండర్‌లోనూ చూపించింది. టెండర్‌ ఓపెన్‌ చేయకముందే మోసం చేసిన కంపెనీని పక్కన పెట్టాల్సిన టీటీడీ అధికారులు ఆ దిశగా నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పై రెండు అంశాల తో ఆ సంస్థ డిఫాల్టర్‌గా ముద్రపడింది. రాజకీయ నేతల ఒత్తిడికి తలొగ్గిన టీటీడీ అధికారులు అనర్హత కలిగిన కంపెనీకే మెడికల్‌ షాపును అప్పగించేందుకు పావులు కదపడం చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు టీటీడీ చైర్మన్‌ సైతం డిఫాల్ట్‌ కంపెనీకే కేటాయించేలా అధికారులకు సూచనలు చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది. సదరు కంపెనీ ఎక్కువ కోట్‌ చేసిందనే సాకును చూపి, డిఫాల్టర్‌ అనే విషయాన్ని పక్కన పెట్టడంపై కొందరు కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది.

స్విమ్స్‌లో మెడికల్‌ మాఫియా!1
1/1

స్విమ్స్‌లో మెడికల్‌ మాఫియా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement