
పెళ్లిపత్రికలు ఇచ్చి వస్తుండగా ప్రమాదం
యాదమరి : పెళ్లిపత్రికలు ఇచ్చి వస్తుండగా ప్రమాదవశాత్తు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని కారులోని ముగ్గురు గాయపడిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి మండలంలో చోటు చేసుకుంది. వివరాలు..పూతలపట్టు మండలం బండపల్లి గ్రామానికి చెందిన నరేష్, భీమేశ్వరన్, వినోద్ కలిసి కారులో తమిళనాడు రాష్ట్రం గుడియాత్తంకు వెళ్లి వస్తున్నారు. మార్గమధ్యలో మండల పరిధి సంతగేటు సమీపంలోకి రాగానే అదుపు తప్పి గుడియాత్తం వైపుగా వెల్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. అర్ధరాత్రి భారీ శబ్ధం రావడంతో భయాందోళన చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలికి చేరుకుని గాయపడ్డ క్షతగాత్రులను 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నామని స్థానిక ఎస్‌ఐ ఈశ్వర్ తెలిపారు.
కారు బోల్తా పడి ఒకరి మృతి
తిరుపతి రూరల్ : మండలంలోని చిగురువాడ వద్ద స్వర్ణముఖినదిలో కారు బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండలం, కిచ్చమనాయుడుపల్లెకు చెందిన కంకలపాటి మురళి (42) తిరుపతిలో నివసిస్తున్నాడు. అయితే వ్యాపారం రీత్యా కార్వేటినగరంలో ప్రొవిజన్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. నిత్యం తిరుపతి నుంచి కార్వేటినగరానికి వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కారులో తిరుపతికి వస్తుండగా చిగురువాడ బ్రిడ్జి వద్ద టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి స్వర్ణముఖి నదిలోకి దూసుకు వెళ్లింది. అదే సమయంలో అటుగా వచ్చిన కేసీపేట సర్పంచ్ పినాకపాణి మరికొందరి సాయంతో మురళిని బయటకు తీసి 108లో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మరణించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సీఐ చిన్న గోవిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లిపత్రికలు ఇచ్చి వస్తుండగా ప్రమాదం