
బాలికలు, మహిళలకు రక్షణ కల్పించాలి
● సమావేశంలో ఐద్వా జిల్లా నాయకురాలు చిట్టెమ్మ డిమాండ్
చిత్తూరు కార్పొరేషన్ : బాలికలు, మహిళలకు రక్షణ కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా నాయకురాలు చిట్టెమ్మ డిమాండ్ చేశారు. బుధవారం ఆ సంఘం నాయకులు వారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. చిత్తూరు నగరంలో బాలికలు, మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పలు ఘటనలతో మహిళలు, బాలికలు భయాందోళనకు లోనవుతున్నారని తెలిపారు. రోజురోజుకు బాలికలు, మహిళలపైన అఘాయిత్యాలు జరగడం దారుణమన్నారు. అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి పాలకులు రోజూ మహిళలకు అన్ని రకాల పథకాలు అందిస్తున్నామని గొప్పగా ప్రచారం చేస్తున్నారే తప్ప ఆచరణలో అవేమి జరగడం లేదన్నారు. జిల్లా కేంద్రంలో అన్ని రకాల అధికారులు సౌకర్యాలు ఉన్నా ఇక్కడే పలు ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. పోలీసులు చిత్తశుద్ధితో వ్యవహరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ సంఘం సభ్యులు పాల్గొన్నారు.