
రక్తదానంతో ప్రాణదానం
గుడిపాల : రక్తదానం చేసి ప్రాణ రక్షకుడిగా మారి నిజమైన హీరో అవ్వాలని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్‌డూడి అన్నారు. బుధవారం స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా చీలాపల్లె వద్ద ఉన్న సీఎంసీ ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం ప్రాముఖ్యం వివరించారు. రక్తం కృత్రిమంగా తయారు చేయలేని అత్యంత విలువైన బహుమతి అని, ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాన్ని నిలబెట్టే మహోన్నతమైన సేవ అని చెప్పారు. అరుదైన రక్తగ్రూప్ కలిగిన దాతలు సమాజానికి నిజమైన ప్రాణ రక్షకులని అభినందించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మొక్కలను నాటారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. కార్యక్రమంలో సిఎంసీ ఆస్పత్రి అసోసియేట్ డైరెక్టర్ ఉదయ్ జకారియా, మెడికల్ సూపరింటెండెంట్ అలెక్స్, రక్తశాస్త్రం హెడ్ డాక్టర్ డాలి, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ నిర్మల మార్గరెట్, సీఎంసీ ఆసుపత్రి అడ్మిన్ ప్రిన్స్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ సూర్యనారాయణ, వెస్ట్ సీఐ శ్రీధర్‌నాయుడు పాల్గొన్నారు.
సామాజిక విలువలకు ప్రతీక
చిత్తూరు అర్బన్ : చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి అని.. ఇది ధార్మిక, సామాజిక విలువలకు ప్రతీకని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ పేర్కొన్నారు. కుటుంబ సఖ్యతను గౌరవించడం, సంప్రదాయాలను పాటించడం, సమాజంలో ఐక్యతను పెంపొందించడానికి ప్రజలంతా ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు. ఈ దశమిను అందరూ సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.