
అమ్మో.. మృగాళ్లు
గ్యాంగ్‌రేప్ నిందితులకు బిగుస్త్తున్న ఉచ్చు
కీలకమైన ఆధారాలు సేకరించిన పోలీసులు
ఘటనా స్థలంలో ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్ బృందాలతో జల్లెడ
ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆ మృగాళ్ల ఫోన్లలో వీడియోల తనిఖీ.. ఎఫ్‌ఎస్‌ఎల్‌కు తరలింపు
చిత్తూరు అర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు నగరంలో బాలికపై సామూహిక లైంగికదాడి కేసులో నిందితులు చేసిన పాపానికి ఉచ్చు బిగుస్తోంది. నేరం చేస్తే ఎవరూ నోరు విప్పరనే ధైర్యంతో ఉన్న ఆ ముగ్గురూ.. చేసిన నేరాన్ని సాక్ష్యాలతో సహా న్యాయస్థానం ఎదుట నిరూపించడానికి ఆధారాలు సేకరిస్తున్నారు. బుధవారం చిత్తూరు డీఎస్పీ సాయినాథ్‌తో పాటు, తాలూక ఎస్‌ఐ మల్లికార్జున, ఫింగర్‌ప్రింట్ ఇన్‌స్పెక్టర్ సతీష్, తిరుపతిలోని ఫోరెన్సిక్ సైంటిఫిక్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్) కేంద్రానికి చెందిన మహిళా అధికారి గ్యాంగ్‌రేప్ జరిగిన ఘటనా స్థలంలో పలు సాక్ష్యాలను సేకరించారు. దాదాపు రెండు గంటల పాటు పోలీసులు ఘటనా స్థలాన్ని జల్లెడ పట్టి, కీలకమైన ఆధారాలను సేకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం
నిందితులను పట్టుకునేప్పుడు స్థానికులపై తిరగబడటానికి ప్రయత్నిస్తే దేహశుద్ధి చేశారు. ఆపై నిందితులు తీసిన వీడియోలు బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. నిందితులు కిషోర్, మహేష్, హేమంత్ అఘాయిత్యం జరిగిన తీరును వివరిస్తున్నట్లుగా ఆ వీడియోల్లో తెలుస్తోంది. వీళ్లను పోలీసులకు అప్పగించే క్రమంలో నిందితులు ముగ్గురూ పారిపోగా.. తాజాగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇక నిందితుల మొబైల్ ఫోన్లలో వీడియోల విషయం తేల్చడానికి వాటిని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపనున్నారు. నిందితులను గురువారం అరెస్టు చూపించే అవకాశం ఉంది.
పార్కులో అటవీశాఖ భద్రత డొల్ల
ఈ ఘటనలో చిత్తూరు పశ్చిమ రేంజ్ అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పార్కులో ఎంట్రీ కోసం రూ.10 డిజిటల్ చెల్లింపుల ద్వారా వసూలు చేస్తున్న అధికారులు, ఇక్కడ సందర్శకుల భద్రత కోసం ఏ ఒక్క చర్య పాటించడంలేదు. దాదాపు 6 కి.మీ విస్తీర్ణం ఉన్న నగర వనంలో ఒక్కటంటే ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పైగా పార్కులో దట్టమైన రిజర్వు ఫారెస్టు (ఆర్‌ఎఫ్) కలిసి ఉంది. ఈ రెండింటినీ వేరుచేసే కంచె కూడా లేదు. దీనివల్ల వన్య మృగాలు సందర్శకులపై దాడి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సందర్శకులు సైతం పార్కును దాటుకుని ఆర్‌ఎఫ్‌లోకి వెళితే, వాళ్లు బయటకు వచ్చారా..? లేదా కూడా తెలియదు. ఇక వాచర్లు, బీట్ అధికారులు పూర్తి సమయం ఇక్కడ ఉండటం లేదు. సందర్శకులకు కనీస భద్రత లేకుండా ఆఘమేఘాలపై నగరవనాన్ని అందుబాటులోకి తీసుకురావడం అధికారుల అత్యుత్సాహమే అవుతుంది. దీనిపై వెస్ట్ రేంజ్ ఎఫ్‌ఆర్‌వో పట్టాభి వివరణ ఇస్తూ.. ఆర్‌ఎఫ్ చుట్టూ కంచె ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, హెచ్చరిక బోర్డులు పెట్టామని, వాచర్లను కూడా పెట్టామంటూ చేతుల కాలాక ఆకులు పట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు.
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ సాయినాథ్, ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్ బృందాలు
గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డ నిందితులు
మాటువేసి..కాటువేసి
గత నెల 25వ తేదీన బాలిక, ఆమె స్నేహితుడు కలిసి చిత్తూరు–తిరుపతి రోడ్డులో ఉన్న అటవీశాఖకు చెందిన నీవా నగరవనికి వెళ్లడం.. అక్కడ కిషోర్, మహేష్, హేమంత్ ముగ్గురూ బాలికపై అఘాయిత్యానికి పాల్పడటం అయిదు రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది. అయితే నిందితులు ముగ్గురికీ నీవా నగరవనంపై పూర్తి పట్టు ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. బాలిక, ఆమె స్నేహితుడు లోపలికి వెళ్లగానే వాళ్లను వెనక నుంచి నిందితులు ముగ్గురూ వెంబడించారు. ఓ చోట ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటుండగా అప్పటికే మాటు వేసిన నిందితులు చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్నారు. తొలుత తమను అటవీశాఖ సిబ్బందిగా చెప్పుకున్న నిందితులు, బాధితులు ఇద్దరినీ ఓ గుట్టపై ఉన్న నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లారు. అప్పటికే తమ వద్ద ఉన్న కత్తులు చూపించి బాలికపై ఒకరి తరువాత ఒకరు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ సమయంలో బాలికతో వచ్చిన యువకుడు ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తే అతడిపై విచక్షణారహితంగా దాడిచేసి, నోరుమూసి పెట్టి చంపడానికి ప్రయత్నించారు. చివరగా వెళ్లేప్పుడు యువకుడి బంగారు చైనును లాక్కెళ్లారు. ఈ మొత్తం ఘటనలో కొన్ని నిముషాల వీడియో నిందితుల మొబైల్ ఫోన్లలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల తరువాత గాయపడ్డ యువకుడు జరిగిన విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఆపై వారు నిందితుల కోసం గాలించి, గత నెల 29వ తేదీన వాళ్లను పట్టుకుని దేహశుద్ధి చేశారు.

అమ్మో.. మృగాళ్లు

అమ్మో.. మృగాళ్లు

అమ్మో.. మృగాళ్లు