
నేడు మద్యం.. మాంసం విక్రయాల నిషేధం
చిత్తూరు అర్బన్ : గాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం జిల్లాలో ఎక్కడా కూడా మద్యం అమ్మకాలు నిర్వహించొద్దని చిత్తూరు జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. బార్లలో కూడా మద్యం అమ్మకాలు ఉండొద్దని.. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక చిత్తూరు నగరంలో ఎక్కడా మాంసం విక్రయాలు చేయకూడదని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు. మున్సిపల్ జంతు వధశాల, చేపల మార్కెట్‌ను సైతం మూసి ఉంచనున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాకు రెండు కేంద్రీయ విద్యాలయాలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో రెండు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఈనెల 1న ఆర్థిక వ్యవహారాల కేబినేట్ కమిటీ ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. కొత్తగా ప్రకటించిన కేంద్రీయ విద్యాలయాలో జాబితాలో చిత్తూరు జిల్లా కేంద్రంలోని మంగసముద్రం వద్ద ఒకటి, కుప్పం మండలంలోని బైరుగానిపల్లి వద్ద మరొకటి మంజూరయ్యాయి. మంజూరైన కేంద్రీయ విద్యాలయాలకు నూతన భవనాలను నిర్మించే వరకు తాత్కాలిక భవనాల్లో తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. మొదట్లో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు తరగతులు ప్రారంభించే అవకాశాలున్నాయి. ఆ తర్వాత అదనపు తరగతులు పెంచుకుంటూ వెళ్తారు. ఇలా ఇంటర్ వరకు కేంద్రీయ విద్యాలయాల్లో బోధన చేస్తారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించే అవకాశాలు ఉంటాయని అధికారులు వెల్లడిస్తున్నారు.
రేపటి నుంచి
డీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఈనెల 3వ తేదీ నుంచి 10 వరకు డీఎస్సీలో ఎంపికై న అభ్యర్థులకు శిక్షణ నిర్వహించనున్నట్లు డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో 8 రోజుల పాటు నిర్వహించే శిక్షణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. ఈ శిక్షణలో పాల్గొనే అభ్యర్థులు తప్పనిసరిగా సూచనలు పాటించాలన్నారు. శిక్షణ కార్యక్రమం రెసిడెన్షియల్ విధానంలో జరుగుతుందన్నారు. కొత్తగా ఎంపికై న టీచర్లందరూ కచ్చితంగా హాజరు కావాలన్నారు. గైర్హాజరైతే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. శిక్షణ పొందే వారికి మాత్రమే కౌన్సెలింగ్ ఉత్తర్వులు జారీ చేస్తారని వెల్లడించారు. శిక్షణ కార్యక్రమానికి ప్రతి అభ్యర్థి అధునాతన ఆండ్రాయిడ్ ఫోన్ తెచ్చుకోవాలన్నారు. నియామకపత్రం కచ్చితంగా తెచ్చుకోవాలన్నారు.
మహిళల ఆరోగ్యంపై
ప్రత్యేక శ్రద్ధ
ఐరాల : స్వస్త్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎంహెచ్‌ఓ సుధారాణి ఆదేశించారు. బుధవారం కాణిపాకం పీహెచ్‌సీని ఆమె తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు నమోదు, వివిధ రకాల ఆరోగ్య సేవల రికార్డులు, స్కానింగ్ పరికరాల నిర్వహణపై తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. దీనిలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరాల్లో మహిళలకు అందిస్తున్న వైద్య సేవలు అన్ని రకాల యాప్‌లో నమోదు చేయాలని వైద్యాధికారి స్వాతి సింధూరకు సూచించారు. పీహెచ్‌సీలో ప్రసవాల సంఖ్య పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆస్పత్రి ఆవరణలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా సచ్చిదానందమూర్తి
తిరుపతి సిటీ : జాతీయ సంస్కృత వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్‌చార్జిగా ప్రొఫెసర్ సచ్చిదానందమూర్తిని నియమిస్తూ వీసీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు పరీక్షల నియంత్రణ అధికారిగా పనిచేసిన డాక్టర్ కంభంపాటి సాంబశివమూర్తి ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సాంబశివమూర్తి సేవలను కొనియాడారు. అనంతరం సచిదానందమూర్తికి అభినందనలు తెలిపారు.

నేడు మద్యం.. మాంసం విక్రయాల నిషేధం