
కమిషనర్ తీరుపై ఆగ్రహం
పుత్తూరు : పుత్తూరు మున్సిపల్ కమిషనర్ వ్యవహార తీరుపై మున్సిపల్ కౌన్సిల్‌లో ఎగసిన ఆగ్రహ జ్వాల కలెక్టర్ వద్దకు చేరింది. బుధవారం పుత్తూరు మున్సిపాలిటీలోని సమస్యలు, వాటికి మున్సిపల్ కౌన్సిల్ చేసే తీర్మానాలు, అమలు కాకపోవడాన్ని పూర్తి వివరాలతో మున్సిపల్ చైర్మన్ ఆనంగి హరి, వైస్‌చైర్మన్లు జయప్రకాష్, శంకర్, కౌన్సిలర్లు వినతిపత్రం రూపంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌కు అందించారు. కౌన్సిల్‌లో ఎదురయ్యే సమస్యలను కలెక్టర్‌కు వివరిస్తూ మున్సిపాలిటీ కమిషనర్‌గా మంజునాథ్ గౌడ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటికి వరకు 7 సమావేశాలు జరిగాయని ఆ సమావేశాల్లో చేసిన తీర్మానాలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదన్నారు. కమిషనర్ దృష్టికి తీసుకొచ్చినా ఏ మాత్రం స్పందన లేదన్నారు. అధికారిగా ఆయన వ్యవహరించడం లేదని పచ్చచొక్కా తొడుక్కున్న నేతలా వ్యవహరిస్తున్నారన్నారు. వర్షాకాల పరిస్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదన్నారు. పార్టీ మారిన ఇద్దరు కౌన్సిలర్లపై విప్ యాక్షన్ తీసుకొని అనర్హులుగా ప్రకటించమన్నా స్పందించడం లేదన్నారు. 4వ వార్డు కౌన్సిలర్ కేశవా ఆచారి ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చి 6 నెలలైనా గౌరవ వేతనం ఇస్తూ సమావేశానికి అనుమతిస్తున్నారన్నారు. మున్సిపల్ పార్కు, క్రిమేషన్ షెడ్డు, షాదిమహల్ ఇలా గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారన్నారు. 90 శాతం పూర్తయిన మున్సిపల్ భవనాన్ని వినియోగంలోకి తేవడం లేదన్నారు. ఆక్రమణల తొలగింపుపై చర్యలు తీసుకోలేదన్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం మున్సిపల్ కౌన్సిల్‌కు ఉన్న హక్కులు ఏమయ్యాయని ప్రశ్నించారు. అధికారులే హక్కులు కాలరాస్తుంటే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందన్నారు. అలాంటి కమిషనర్ మా కొద్దంటూ మున్సిపల్ కౌన్సిల్ వేదికగా ఏకగ్రీవంగా సరెండర్ చేయాలని ఆమోదించినా మినిట్స్ పుస్తకంలో నమోదు చేయలేదన్నారు. సమస్య తీవ్రతను అవగాహన చేసుకొని కమిషనర్‌ను సరెండర్ చేయాలని, కౌన్సిల్‌కు న్యాయం చేయాలని కోరారు. అలాగే పుత్తూరు ఈశలాపురం సర్వే నంబరు 6లో గ్రానైట్ క్వారీ ఉందని ఆ క్వారీలో పరిమితికి మించి పేలుళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కారణంగా జనజీవనానికి ఇబ్బందులు కలుగుతున్నాయని, పక్కనే ఉన్న మామిడి తోటలు, ఇతర పంటలపై దుమ్ము చేరి పంటలు సరిగా పండటం లేదన్నారు. ఇటీవల ఒక బాలుడి తలపై రాయిపడి తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడన్నారు. రైతుల బోర్లు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి తీవ్రతను అర్థం చేసుకొని క్వారీని నిలుపుదల చేయాలని కోరారు.