
ప్రశ్నించడంతోనే గ్యాంగ్‌రేప్ విషయం వెలుగులోకి!
నిందితులందరూ టీడీపీ కార్యకర్తలే
గతంలోనే వారు టీడీపీలోకి వెళ్లారు
అభివృద్ధిని స్వాగతిస్తాం.. దుర్మార్గాలను ఎండగట్టి తీరుతాం
చిత్తూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి
చిత్తూరు అర్బన్: ‘చిత్తూరులో మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడ్డ నిందితులు ముమ్మాటికీ టీడీపీ కార్యకర్తలే. ఎమ్మెల్యే జగన్‌మోహన్‌నాయుడు స్వయానా వీళ్లకు పచ్చ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు గ్యాంగ్‌రేప్ విషయం బయటపడంతో నిందితులకు వైఎస్సార్‌సీపీ రంగు పూయాలనుకోవడం టీడీపీ నేతల అవివేకానికి నిదర్శం’ అంటూ చిత్తూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎంసి.విజయానందరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గ్యాంగ్‌రేప్ జరిగిన విషయం, బాధితులకు న్యాయం చేయాలని ప్రతిపక్షం ప్రశ్నించడంతోనే పోలీసు శాఖలో చలనం వచ్చిందన్నారు. వైఎస్సార్‌పీసీ దీనిపై ప్రశ్నించకుంటే విషయం వెలుగులోకి వచ్చేదికాదని, బాధితలకు అన్యాయం జరిగేదనని స్పష్టం చేశారు. ఎస్పీ కల్పించుకోవడంతోనే పోలీసు అధికారులు కేసు నమోదు చేశారని, లేని పక్షంలో ఘటన మరుగున పడిపోయేదన్నారు. ఆగస్టు 27న నిందితులు కిషోర్, మహేష్ ఇద్దరికీ ఎమ్మెల్యే టీడీపీ కండువాలు కప్పారని, ఎమ్మెల్యే పనితీరు నచ్చడంతో పాటు సూపర్‌సిక్స్ అమలు విధానంపై ఆకర్షితులై పార్టీలో చేరినట్లు నిందితులు చెప్పిన వీడియోను సైతం విడుదల చేశారు. గతంలో వీళ్లు వైఎస్సార్‌సీపీలో ఉన్నమాట నిజమేనని, వీళ్ల ప్రవర్తన నచ్చక పార్టీ నుంచి పంపించేస్తే.. ఆపై టీడీపీ నేతలు ఎల్‌బీఐ లోకేష్, కార్పొరేటర్ నవీన్ చేరదీసి ఆ పార్టీలో చేర్పించారన్నారు. చిత్తూరులో అభివృద్ధిని తాము స్వాగతిస్తామని.. ఇదే సమయంలో అధికార పార్టీ ముసుగులో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు గాయత్రీదేవి, మొదలియార్ విభాగం నాయకులు జ్ఞానజగదీష్ మాట్లాడుతూ గత నెల పీవీకేఎన్ డిగ్రీ కళాశాల వద్ద అఖిల్ అనే వ్యక్తి ప్రేమ జంటలను పోలీసునంటూ బెదిరించి, బంగారు ఆభరణాలు దోచుకున్నాడని.. అప్పుడు కూడా తమ పార్టీనే దీనిపై ప్రశ్నించిందన్నారు. డిప్యూటీ మేయర్ రాజేష్‌కుమార్‌రెడ్డి శిష్యుడైన అఖిల్ టీడీపీకి చెందిన వాడని, అతడికి సైతం వైఎస్సార్‌సీపీ రంగు పులమడానికి అధికార పార్టీ నేతల ప్రయత్నాలు ఫలించలేదన్నారు. చిత్తూరులో మహిళల మాన ప్రాణాలు పోతున్నా, గ్యాంగ్‌రేప్ జరుగుతున్నా ప్రశ్నిస్తామన్న పవణ్‌కళ్యాణ్ నోరు కూడా మెదపడంలేదన్నారు. చిత్తూరులో జరుగుతున్న ఘటనలు పోలీసు శాఖ పనితీరుని ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. పైగా ప్రశ్నించే ప్రతిపక్షంపైనే అధికార పార్టీ నేతలు నిందలు మోపడం పద్ధతికాదన్నారు. నగర పార్టీ అధ్యక్షుడు శ్రీధర్, పార్టీ నేతలు అంజలిరెడ్డి, మధుబాబు, హరీషారెడ్డి, కవిత, ప్రతిమారెడ్డి, బిందురెడ్డి, విజయశాంతి పాల్గొన్నారు.