ద్రవిడ వర్సిటీ అధికారులపై కలెక్టర్‌ ఫైర్‌..! | - | Sakshi
Sakshi News home page

ద్రవిడ వర్సిటీ అధికారులపై కలెక్టర్‌ ఫైర్‌..!

Sep 19 2025 1:51 AM | Updated on Sep 19 2025 1:51 AM

ద్రవిడ వర్సిటీ అధికారులపై కలెక్టర్‌ ఫైర్‌..!

ద్రవిడ వర్సిటీ అధికారులపై కలెక్టర్‌ ఫైర్‌..!

– వీసీని నిలదీసిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు

కుప్పం: ద్రావిడ విశ్వవిద్యాలయంలో వైస్‌ చాన్సలర్‌ సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యమిస్తూ వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల పేరిట నూతన ఉద్యోగాలు, తన సామాజిక వర్గానికి చెందిన వారికే ఉద్యోగోన్నతులపై ‘ద్రవిడ వర్సిటీలో ‘కమ్మ’టి పదోన్నతులు’ శీర్షికతో సాక్షి ప్రచురించిన కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. దీనిపై సీరియస్‌ అయి గురువారం జిల్లా కలెక్టర్‌ వర్సిటీ ఫోన్‌ ద్వారా నూతన ఉద్యోగాలపై వర్సిటీ అధికారులను ఆరా తీసినట్లు తెలిసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇష్టానుసారంగా ఎలా ఉద్యోగాలు ఇస్తారంటూ మండిపడినట్లు తెలిసింది.

కలెక్టర్‌ దెబ్బకు కొత్త ఉద్యోగాలకు స్వస్తి

ఇంజినీరింగ్‌ కళాశాల పేరిట కొత్తగా వీసీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఉద్యోగుల భార్యలకు ఉద్యోగాలు కల్పించేందుకు వర్సిటీ అధికారులు పూనుకున్నారు. దీనిపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ నియామకాలకు తాత్కాలికంగా స్వస్తి పలికినట్టు సమాచారం. వాస్తవానికి ఇప్పటికే వర్సిటీలో 200 మందికి పైగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు వివిధ క్యాడర్లలో పనిచేస్తున్నారు. వీరికి జీతాలు ఇవ్వడానికే నానా తంటాలు పడుతున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా ఉద్యోగాల్లో నియామకాలకు పూనుకోవడం విమర్శలకు తావిచ్చింది. ఇప్పటికే వర్సిటీ మేథమేటిక్స్‌ విభాగంలో పని చేస్తున్న ఓ కాంట్రాక్టు అధ్యాపకురాలికి అడ్‌హాక్‌ పద్ధతిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు కట్టబెట్టారు. అయితే సంబంధిత విభాగంలో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడడం గమనార్హం! దీంతో పాటు ఇంజినీరింగ్‌ విభాగంలో కాంట్రాక్టు పద్ధతిలో ఇద్దరు అధికారులను నియమించుకోవడం కూడా విమర్శలకు తావిచ్చింది.

రైతు కుటుంబాలతో ముట్టడిస్తామని వార్నింగ్‌

ఇష్టానుసారంగా నూతన ఉద్యోగాల కల్పన విషయంగా దుమారం రేగడంతో వర్శిటీకి భూములు ఇచ్చి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు పొందిన ఉద్యోగులు వీసీని నిలదీశారు. తమకు 20 ఏళ్లుగా న్యాయం చేయకుండా, కనీసం జీతాలు సక్రమంగా ఇవ్వకుండా కొత్త ఉద్యోగాలు, ఉద్యోగోన్నతులు ఎలా కల్పిస్తారంటూ ప్రశ్నించారు. తమకు న్యాయం చేయకుండా బయటి వ్యక్తులకు ఉద్యోగాలు కల్పిస్తే సహించేది లేదని, వర్సిటీకి భూములు ఇచ్చిన రైతు కుటుంబాలతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించినట్లు సమాచారం. ఇదలా ఉంచితే, వర్సిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం పేర్కొంటున్నా, ఇక్కడి ఇన్‌చార్జి అధికారులు మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement