
మహిళా పాడి రైతులను ప్రోత్సహించాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మహిళా పాడి రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధుల వృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్‌హెచ్‌జీ మహిళల ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయ, అనుబంధ ఇతర రంగాలకు సంబంధించి ప్రణాళికలు రూపొందించాలన్నారు. మహిళలకు తమ ఇంటి వద్ద ఉన్న అవకాశాన్ని బట్టి కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు అవసరమైన అవగాహన కల్పించి విత్తనాలు సరఫరా చేయాలన్నారు. సీడీపీవోలు క్షేత్రస్థాయిలో ప్రతి అంగన్‌న్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి నివేదికలు అందజేయాలన్నారు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ రంగంలో మహిళలు రాణించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. నగరి, విజయపురం, కార్వేటినగరం, ఎస్‌ఆర్‌పురం మండలాల్లో మహిళా రైతులకు ఉద్యానవన పంటలపై ఆసక్తి పెంచేలా కృషి చేయాలన్నారు.
మహిళా రైతులకు అవగాహన కార్యక్రమాలు
జిల్లాలోని మహిళా రైతులకు టిష్యూ కల్చర్ విధానంలో అరటి, బొప్పాయి పంటలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో ని మహిళా పాడి రైతులను గుర్తించి అవగాహన కార్యక్రమాలు కల్పించాలన్నారు. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వ్యవసాయరంగంలో డ్రోన్ వినియోగం పై విస్తృతంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, డీఈవో వరలక్ష్మి, జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు.