
ద్రవిడ వర్సిటీలో.. ‘కమ్మ’ని పదోన్నతులు!
కుప్పం: ద్రావిడ విశ్వవిద్యాలయంలో పదోన్నతులు, ఇంజినీరింగ్ కళాశాల పేరిట నూతన ఉద్యోగాల్లో వర్సిటీ వీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే పెద్దపీఠ వేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది ముగిసినా ద్రవిడ వర్సిటీకి మాత్రం నూతన రెగ్యులర్ వీసీని నియమించ లేదు. దీంతో ఇన్‌చార్జి వీసీగా వర్సిటీ లైబ్రేరియన్ ఆచార్య దొరస్వామి కొనసాగుతున్నారు. వర్సిటీకి నూతనంగా ఇంజినీరింగ్ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
అవసరం లేకున్నా!
ద్రావిడ యూనివర్సిటీ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో బోధించేందుకు బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టారు. ఇంజినీరింగ్ కళాశాలలో లైబ్రరీకి లైబ్రరీ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. వర్సిటీ ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగికి లైబ్రరీ అసిస్టెంట్ పోస్టును కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వర్సిటీలో ఇప్పటికే ఏడుగురు లైబ్రరీ అసిస్టెంట్లు రెగ్యులర్ పద్ధతిలో, నలుగురు తాత్కాలిక పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం వీరిలో కొందరిని ఇంజినీరింగ్ కళాశాలలో ఉపయోగించుకోవచ్చు. కానీ వీసీ సామాజిక వర్గానికి చెంది, ఆయనకు ఆప్తుడు అయిన అతనికి లైబ్రరీ అసిస్టెంట్‌ను కట్టబెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఇంటర్వ్యూను సైతం ముగించేశారు. ఈ పోస్టుకు స్థానికులు కొందరు దరఖాస్తులు చేసుకుని ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అదేవిధంగా స్థానిక నాయకులు ఈ ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదనే చెప్పాలి.
స్థానిక దళిత ఉద్యోగికి అన్యాయం
వర్సిటీలో గతంలో చంద్రశేఖర్ అనే తాత్కాలిక ఉద్యోగికి తన అర్హత మేరకు అటెండర్ నుంచి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి కల్పించి జీతాన్ని పెంచారు. అయితే కూటమి ప్రభుత్వం రాగానే ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించిన వీసీ అతనికి డీ–ప్రమోట్ చేసి మళ్లీ అటెండర్‌గా మార్చారు. వీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ ఉద్యోగికి శానిటరీ ఇన్‌స్పెక్టర్ పదవిని కట్టబెట్టినట్టు బాధితుడు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేశాడు.
ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం
సీనియర్ అసిస్టెంట్‌కు పదోన్నతి!
ఇటీవల వర్సిటీలో సూపరింటెండెంగ్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్ముగం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఖాళీ ఏర్పడిన ఈ పోస్టుకు వీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ సీనియర్ అసిస్టెంట్‌కు పదోన్నతి ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు గతంలో ఇక్కడ విధులు నిర్వహించి రిటైర్డ్ అయిన ఓ ఉన్నతాధికారిని పిలిపించుకుని మరీ సంబంధిత సీనియర్ అసిస్టెంట్‌కు ఎలా పదోన్నతి కల్పించాలని మంతనాలు జరిపినట్టు వర్సిటీలో చర్చసాగుతోంది.
భూములు కోల్పోయిన ఉద్యోగులకు మొండి చేయి
ద్రావిడ వర్సిటీ వెయ్యి ఎకరాలకుపైగా భూములతో విస్తరించి ఉంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ భూములను వర్సిటీకి ధారాదత్తం చేశారు. భూములు కోల్పోయిన వారికి కుటుంబానికి ఒకరికి తాత్కాలిక పద్ధతిలో అటెండర్లు, స్వీపర్లుగా ఉద్యోగాలు కల్పించారు. అయితే గత 20 ఏళ్లుగా వారు తాత్కాలిక పద్ధతిలో విధులు నిర్వహిస్తూ కనీస జీతాలు సైతం నోచుకోక మగ్గిపోతున్నారు. గతంలో ఏడాది కాలానికి జీతాలు అందించినా.. మరళా ఐదు నెలల పాటు జీతాలు అందక వారి పరిస్థితి దారుణంగా మారింది. కొత్తగా ఏజెన్సీని నియమించి జీతాలు ఇస్తామంటూ కాలయాపన చేస్తున్నారు. ద్రవిడ వర్సిటీని ప్రక్షాళన చేస్తామని పదే పదే అధికార పార్టీ నేతలు అంటున్నా ఇక్కడి అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుండడం గమనార్హం.