ఆర్టీసీ బస్సు.. సీఎన్‌జీగా మార్పు! | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు.. సీఎన్‌జీగా మార్పు!

Sep 18 2025 7:15 AM | Updated on Sep 18 2025 7:15 AM

ఆర్టీసీ బస్సు.. సీఎన్‌జీగా మార్పు!

ఆర్టీసీ బస్సు.. సీఎన్‌జీగా మార్పు!

చిత్తూరు డిపోలో ఫలించిన ప్రయోగం రాష్ట్రంలోనే తొలిసారి చిత్తూరు–వేలూరు మార్గంలో నడుస్తున్న బస్సు పొల్యూషన్‌ తక్కువ, ఆదా ఎక్కువ అంటున్న ఆర్టీసీ అధికారులు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : ఆర్టీసీ ఆదాలో పడింది. నష్టాలను అధిగమించేందుకు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టింది. డీజల్‌ బండిని సీఎన్‌జీ ( కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ )గా మార్చేందుకు పూనుకుంది. థింక్‌ గ్యాస్‌తో ఒప్పందం కుదుర్చుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ ప్రయోగం ఫలించింది. బుధవారం ఆ మార్పు చేసిన బస్సును ఆర్టీసీ అధికారులు రోడ్డుపైకి తీసుకొచ్చారు. చిత్తూరు–వేలూరు మార్గంలో తిప్పుతున్నారు. దీంతో ఆర్టీసీకి ఆదాయం ఆదాతో పాటు బండి పొల్యూషన్‌ను నియంత్రవచ్చునని ఆర్టీసీ అధికారులు వెల్లడిస్తున్నారు.

ఆర్టీసీ, థింక్‌ గ్యాస్‌ ఒప్పందం మేరకు సీఎన్‌జీ మార్పునకు చిత్తూరు టూ డిపో ఎక్స్‌ప్రెస్‌ బస్సును ఎంపిక చేశారు. చిత్తూరు–వేలూరు మార్గంలో తిరిగే ఈ బస్సును రెండు నెలల క్రితం మార్పునకు తరలించారు. చిత్తూరు నగరం అనుపల్లిలోని సీఎన్‌జీ ఫిలింగ్‌ స్టేషన్‌కు పంపించారు. అక్కడ రెండు నెలలుగా శ్రమించి డీజల్‌ బస్సును సీఎన్‌జీ బస్సుగా మార్పు చేశారు. రాష్ట్రంలోనే డీజల్‌ బస్సును సీఎన్‌జీలోకి మార్చడం ఇదే తొలిసారి అని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

ఆదా ఇలా...

ప్రస్తుతం ఆర్టీసీకి కంపెనీ డీజల్‌ లీటర్‌ రూ.96కు ఇస్తోంది. అదే సీఎన్‌జీ రూ. 84కు లభిస్తోంది. డీజల్‌ నుంచి సీఎన్‌జీకి మార్పు చేయడం వల్ల ఆర్టీసీ లీటర్‌పై రూ.12 దాకా ఆదా కానుంది. కేఎంపీఎల్‌ 5.4 నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంటే ఒక్క సిలిండర్‌ (11 కేజీలు) 58 కి.మీ ప్రయాణం చేయవచ్చునని వివరిస్తున్నారు.

ప్రారంభోత్సవం

చిత్తూరు టూ డిపో గ్యారేజీలో బుధవారం సీఎన్‌జీ బస్సును ప్రారంభించారు. డీపీటీఓ రాము జెండా ఊపి బస్సును ప్రారంభించి..చిత్తూరు–వేలూరు మార్గంలో నడిపారు. వేలూరు వరకు ట్రయల్‌ చూశారు. కేఎంపీల్‌, స్పీడ్‌, శబ్ధం తదితర వాటిని పరిశీలించారు. ఈ బస్సు విజయవంతంగా నడిస్తే మరిన్ని బస్సుల మార్పుకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

గతంలో కూడా ప్రయోగం సక్సెస్‌

2022లో కూడా చిత్తూరు–2 డిపోకు సంబంధించిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ బస్సును ఎలక్ట్రికల్‌ బస్సుగా మార్పు చేశారు. బెంగుళూరులోని వీర వాహన ఉద్యోగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ మార్పును విజయవంతంగా పూర్తి చేసింది. 2 గంటల ఛార్జింగ్‌తో 200 కి.మీ మేర ప్రయాణం చేసేలా మార్పు చేసింది. ఈ బస్సు ప్రయోగం పూర్తవ్వగానే తిరుపతి–తిరుమల మార్గంలో తిప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement