
శ్రీగంధం చెట్లు నరికివేత
● రూ.2 లక్షలు విలువ చేసే కలప చోరీ
చౌడేపల్లె : రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు పొలంలో పెంచిన శ్రీగంధం చెట్లను రంపంతో కోసి అపహరించుకెళ్లిన ఘటన ఏ కొత్తకోట పంచాయతీ ఎస్ అగ్రహారంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధిత రైతు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ అగ్రహారం కు చెందిన ఆర్.మునీంద్రకు పెద్ద గుట్ట సమీపంలో వ్యవసాయ భూమిలో కొన్నేళ్లుగా శ్రీగంధం చెట్లను పెంచుతున్నాడు. మంగళవారం రాత్రి భారీ వర్షం కురుస్తుండడంతో ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు పొలంవద్ద పెంచిన శ్రీగంధం చెట్లను కోసి విలువైన కలపను అపహరించారు. పొలం వద్దకెళ్లిన రైతు గుర్తించి లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కలప విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని, కలపతో పాటు చెట్టు వేర్లతో సహా కోసి తీసుకెళ్లారని వాపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు రైతు పేర్కొన్నారు.
రేపు చలో మెడికల్ కాలేజ్
చిత్తూరు కార్పొరేషన్: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ 19న శుక్రవారం ‘చలో మెడికల్ కాలేజ్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు హేమంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆందోళనలో భాగంగా మదనపల్లెలోని నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిజానిజాలను ప్రజలకు వివరించే కార్యక్రమం చేపట్టనున్నామని తెలిపారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పార్టీ యువత, విద్యార్థి విభాగం నాయకులు కార్యక్రమానికి హాజరై జయపద్రం చేయాలని కోరారు. ఎన్నికల ముందు అమలు కానీ వాగ్దానాలు చేయడం అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికి వదిలేయడం చంద్రబాబుకు పరిపాటి అనిఎద్దేవా చేశారు.
పంట పొలాలపై ఏనుగుల దాడి
పులిచెర్ల (కల్లూరు) : మండలంలోని కల్లూరు, పాళెం, జూపల్లె గ్రామాల్లో బుధవారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు పంట పొలాలపై పడి నాశనం చేశాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పది రోజులుగా ఏనుగులు ఈ చుట్టు ప్రాంతాల్లోనే సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. కల్లూరుకు చెందిన పీరూసాహెబ్, సాజహాన్, ఇక్బాల్ , రామచంద్రకు చెందిన మామిడి తోటల్లో కొమ్మలను విరిచేశాయి. అలాగే జూపల్లెకు చెందిన నరసింహులు, సైద్ బాషాకు చెందిన వరి పంటను తొక్కి ధ్వంసం చేశాయి.
కృత్రిమ కాళ్ల కోసం పేర్లు నమోదు చేసుకోండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా కృత్రిమ కాళ్లు పొందేందుకు అర్హత ఉన్న దివ్యాంగులు పేర్లను నమోదు చేసుకోవాలని జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వినోద్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్లు అందజేయడం జరుగుతుందన్నారు. కావాల్సిన వారు 99892 06667, 90000 10390 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

శ్రీగంధం చెట్లు నరికివేత